fvz

Monday, January 09, 2017

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?!

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?!
  • ఏషియన్‌ పసిఫిక్‌ రీసెర్చ్‌ సంచలన నివేదిక l
  • అమెరికా సంస్థల హితం కోసమే నగదు రహితం!
భారత్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. అమెరికా ప్రణాళికలో అంతర్భాగమా? ప్రపంచ ఆర్థిక రంగాన్ని నగదు రహితంగా మార్చి తన గుప్పెట్లో ఉంచుకుని శాసించే కుట్రలో భాగంగా.. భారతావని మొత్తాన్నీ తొలి ప్రయోగ వేదికగా చేసుకున్నారా? అమెరికా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు, వీసా, మాస్టర్‌ కార్డ్‌ వంటి ఆర్థిక సంస్థల హితం కోసమే.. కోట్లాది మంది ప్రజలను కష్టాల పాలు చేస్తూ మన దేశాన్ని ఆకస్మికంగా నగదు రహితంగా మార్చారా? నల్లధనం ఏరివేత, అవినీతి అంతం కోసం కొంత కాలం కష్టాలను ఓర్చుకోండి అంటూ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసింది అమెరికా కుట్రపూరిత ఎజెండానేనా? అవుననే చెప్తోంది ఏషియన్‌ పసిఫిక్‌ రీసెర్చ్‌ (ఏపీఆర్‌) సంస్థ. ‘చక్కగా దాచిన బహిరంగ రహస్యం: భారతదేశ క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనుక అమెరికా’ శీర్షికతో ఏపీఆర్‌ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలివీ...  


అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన విదేశాంగ విధానంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక ప్రాధాన్యతాంశంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ ఎయిడ్‌) భారత ఆర్థికశాఖతో పలు సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో.. భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం ఒక లక్ష్యంగా ప్రకటించారు. ఆ దిశగా ఏడాది కిందటి నుంచి ఆర్బీఐ అధికారులు, ఆర్థికశాఖ పెద్దలతో యూఎస్‌ఎయిడ్‌ చర్చలు జరిపింది.

భారత్‌లో నగదు రహిత లావాదేవీలకు ఉన్న అడ్డంకులపై గత ఏడాది జనవరిలోనే యూఎస్‌ ఎయిడ్‌ నివేదిక రూపొందించింది. ‘బియాండ్‌ క్యాష్‌’ అనే పేరుతో చేసిన ఆ నివేదికలో.. దేశంలో 97% లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయని, కేవలం 55% మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అందులోనూ 29% ఖాతాలనే గత మూడు నెలల్లో ఉపయోగించారంది. ‘వ్యాపారులు, వినియోగదారులు నగదు వ్యవస్థల్లో చిక్కుకుపోయారు. అది డిజిటల్‌ చెల్లింపులపై వారికి ఆసక్తి కలగకుండా నిరోధిస్తోంది. కొద్దిమంది వ్యాపారులే డిజిటల్‌ చెల్లింపులను అంగీకరిస్తారు కనుక.. దానిపై కొద్దిమంది వినియోగదారులకే ఆసక్తి ఉంటుంది. కార్డు వినియోగం ఒకస్థాయిలో చొచ్చుకుపోయేలా చేయడానికి బయటి నుంచి ఒత్తిడి అవసరం’ అని విశ్లేషించింది.

రద్దుకు నాలుగు వారాల ముందు..
నవంబర్‌ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటించడానికి 4 వారాల ముందు.. భారత్‌లో నగదు రహిత చెల్లింపులను భారీస్థాయిలో పెంచేయడం లక్ష్యంగా ‘క్యాటలిస్ట్‌: సంఘటిత నగదు రహిత చెల్లింపు భాగస్వామ్యం’ అనే పథకాన్ని యూఎస్‌ ఎయిడ్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 14వ తేదీన జారీ చేసిన ఆ పత్రికా ప్రకటనలో.. ‘సార్వజనీన ఆర్థిక సంఘటితంలో యూఎస్‌ ఎయిడ్‌ – భారత ఆర్థిక మంత్రిత్వశాఖల మధ్య భాగస్వామ్యం తర్వాతి దశకు క్యాటలిస్ట్‌ ఒక మైలురాయి’ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో యూఎస్‌ ఎయిడ్, ఐఎంఎఫ్, వీసా, మాస్టర్‌ కార్డ్, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్, పేటీఎం, ఫోన్పే, ఫ్రీచార్జ్, ఈబే, స్నాప్‌డీల్‌  వంటి 35 ప్రపంచ ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్‌ చెల్లింపు సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ క్యాటలిస్ట్‌ ప్రాజెక్ట్‌ ఇంక్యుబేషన్‌ డైరెక్టర్‌ అలోక్‌ గుప్తా.. వాషింగ్టన్లో వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్లా పనిచేశారు. దాని ప్రధాన ప్రాయోజక సంస్థల్లో యూఎస్‌ ఎయిడ్‌ ఒకటి. ఇక భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆన్‌లైన్‌ విక్రయాల వెబ్‌ సైట్‌ స్నాప్‌డీల్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బాదల్‌ మాలిక్‌.. క్యాటలిస్ట్‌ సీఈఓ గా నియమితులయ్యారు. ‘ఆర్థికవ్యవస్థలను డిజిటలైజ్‌ చేయడానికి, చేరుకోవడం కష్టతరమైన ప్రజానీకానికి విస్తరించే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి చేస్తున్న కృషిలో భారతదేశం ముందు వరుసలో ఉంది’ అంటూ యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా మిషన్‌ డైరెక్టర్‌ జొనాథన్‌ అడిల్టన్‌ అక్టోబర్‌ 14న చేసిన ప్రకటన.. ఆ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి పరోక్షంగా చేసిన ప్రకటనేనని ఏపీఆర్‌ అభివర్ణించింది.

ప్రయోగాత్మకంగా అన్నారు కానీ..
తొలుత నిర్దిష్ట ప్రాంతాన్ని లేదా నగరాన్ని ఎంపిక చేసి.. అక్కడ నగదురహిత లావాదేవీలను భారీగా పెంచే కార్యక్రమం చేపడతామని.. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, స్థానిక ఆర్థిక వ్యవస్థ, పాలనా సౌలభ్యం తదితర ప్రమాణాల ప్రకారం ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయటం జరుగుతుందని ఆ ప్రకటనలో వివరించారు. అయితే.. 4 వారాలు గడవక ముందే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పెద్దనోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనం, అవినీతిపై పోరాటం కోసమే ఈ చర్య చేపట్టినట్లు తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే ‘నగదు రహితం’ వైపు మళ్లాలని దేశ ప్రజలకు ఉద్భోదించటం మొదలు పెట్టారు.

ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న 86% నగదు ఒక్కసారిగా చెల్ల కుండాపోవడంతో ప్రజలు డిజిటల్‌ లావాదేవీల వైపు ప్రయాణించక తప్పని పరిస్థితి కల్పించారు. దీంతో.. ఊహించినట్లుగానే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డా కానీ.. డిజిటల్‌ లావాదేవీలు ఆశించినట్టుగానే అనూహ్యంగా పెరిగిపోయాయి. మరోవైపు.. రద్దు చేసిన నగదు స్థానంలో పూర్తి మొత్తాన్ని మార్కెట్లోకి విడుదల చేయకుండా నగదు లభ్యతను పరిమితం చేసి, ఖాతాదారులకు బ్యాంకులు ఇచ్చే నగదుపై ఆంక్షలు విధించి డిజిటల్‌ లావాదేవీలను పెంచే ప్రణాళిక అమలు చేస్తున్నారు.

అమెరికా గుప్పిట్లో ఆర్థిక రంగం
ప్రపంచంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత చెల్లింపుల సేవలు అందించే అమెరికా కంపెనీల వ్యాపారాలను విస్తరించడానికి ఈ చర్య దోహదపడుతుంది. డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందించే వీసా, మాస్టర్‌కార్డ్, పేటీఎం వంటి సంస్థల వ్యాపారాలు, లాభాలూ విస్తరిస్తాయి. డిజిటల్‌ చెల్లింపులు పెంచడంతో పాటు అమెరికా నిఘా శక్తిని విస్తృతం చేయడమూ నగదుపై యుద్ధానికి మరో ముఖ్యకారణంగా ఏపీఆర్‌ చెప్తోంది. అమెరికా నిఘా సంస్థలు, ఐటీ కంపెనీలు కలసి.. డిజిటల్‌ సమాచారంపై నిఘా పెట్టగలవు. ఆర్థిక సమాచారం ముఖ్యంగా మారుతుంది. అంతకంటే ముఖ్యమైనది.. ప్రపంచ కరెన్సీగా అమెరికా డాలరుకు గల హోదా వల్ల కూడా.. నగదు రహిత వ్యవస్థలో పాలుపంచుకునే వారందరినీ తన గుప్పిట్లో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. ఎవరైనా సరే స్థానిక, అంతర్జాతీయ చట్టాలకు కాకుండా అమెరికా చట్టాలను పాటించేలా ఒత్తిడి తెచ్చి, బెదిరించే స్థాయిలో ఉంటుందని, బ్యాంకులు, ప్రభుత్వాలు అమెరికా చేతుల్లో ఉంటాయని ఏపీఆర్‌ విశ్లేషించింది.

నోట్లరద్దుకు కారణాలేంటి?

పీఏసీ సంధించిన ప్రశ్నలు

 నోట్లరద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ, ఆర్బీఐ బోర్డు తీసుకున్నాయని.. దీనికి ప్రభుత్వం ఆమోదం మాత్రమే తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో తెలిపారు. దీంతో మీరు ఏకీభవిస్తారా?

 ఒకవేళ ఇది ఆర్బీఐ ఆలోచనే అయితే.. ఎప్పుడు నోట్లరద్దుపై చర్చించి నిర్ణయం తీసుకుంది?

► రాత్రికి రాత్రి నోట్లరద్దు చేయాలనే నిర్ణయం వెనక ఆర్బీఐ చూపించే అసలైన కారణమేంటి?

► భారత జీడీపీలో నగదు 12 శాతం (జపాన్‌ 18, స్విట్జర్లాండ్‌ 13). భారత కరెన్సీలో పెద్ద నోట్లు 86 శాతం ఉంటే.. చైనాలో 90 శాతం, అమెరికాలో 81 శాతం. ఇలాంటప్పుడు భారత్‌లోనే అత్యవసరంగా నోట్లరద్దు నిర్ణయం తీసుకోవటం వెనక ఉన్న కారణాలేంటి?

► నవంబర్‌ 8న అత్యవసర సమావేశం కోసం ఆర్బీఐ బోర్డు సభ్యులకు ఎప్పుడు నోటీసులు పంపారు? వీరిలో ఎందరు సమావేశానికి హాజరయ్యారు? మీటింగ్‌ మినిట్స్‌ (చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు) ఎక్కడున్నాయి?

► కేబినెట్‌ ఆమోదం కోసం పంపిన లేఖలో.. నోట్లరద్దు వల్ల 86% కరెన్సీ చెల్లకుండా పోవటం, దీని మొత్తం విలువ వంటివి ప్రత్యేకంగా పేర్కొన్నారా? రద్దయిన నోట్ల మొత్తం విలువను చలామణిలోకి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుంది?

► ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 3 సీ(వీ) ప్రకారం.. విత్‌డ్రా పరిమితిపై  ఆంక్షలు విధిస్తున్నట్లు నవంబర్‌ 8న ప్రకటన ఇచ్చారు. ఆర్బీఐలోని ఏ చట్టం ప్రకారం ప్రజలపై విత్‌డ్రా పరిమితి విధించారు? ఆర్బీఐకి ఈ అధికారం ఉందా? అలాంటి చట్టాలేమీ లేకపోతే.. అధికార దుర్వినియోగం చేసినందుకు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోనుంచి తొలగించరాదు?

► రెండు నెలలుగా ఆర్బీఐ నియమాల్లో ఎందుకు త్వరత్వరగా మార్పులు జరిగాయి? ప్రజల విత్‌డ్రాయల్‌ నియంత్రణపై సలహా ఇచ్చిన అధికారి పేరును తెలపండి. వివాహ సంబంధిత విత్‌డ్రాయల్స్‌ నిబంధనలను రాసిందెవరు? ఒకవేళ ఆర్బీఐ కాకుండా ప్రభుత్వమే దీన్ని రాసిస్తే.. మరి ఆర్బీఐ ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగంగా మారిందనుకోవాలా?

► రద్దయిన నోట్ల అసలైన లెక్క ఎంత? బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన పాతనోట్ల విలువెంత? నవంబర్‌ 8న ప్రభుత్వానికి నోట్లరద్దు నిర్ణయంపై సూచన చేసినపుడు.. ఎంత మొత్తంలో నోట్లను రద్దుచేయొచ్చని ఆర్బీఐ భావించింది?

► నోట్లరద్దుపై వివరాలు చెప్పాలంటూ దాఖలైన ఆర్టీఐ ఫిర్యాదులకు సమాధానం ఇచ్చేందుకు ఆర్బీఐ ఎందుకు విముఖత వ్యక్తం చేసింది?


0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top