Wednesday, June 01, 2016

జ్యోతిష్యం పనిచేస్తుందా!


‘సాధారణంగా జ్యోతిషం చెప్పేవారు, మన గ్రహాల స్థితిగతుల ఆధారంగా కాకుండా, ఏళ్ల తరబడి ఏర్పడిన అంతర్‌దృష్టితో (ఇన్‌ట్యూషన్‌) చెప్పేస్తూ ఉంటారు. నేను కావాలనుకుంటే పదేళ్ల తరువాత ఒకరి జీవితంలో ఏం జరగబోతోందో చెప్పేయగలను. మా దగ్గర యోగసాధన చేసేవారు కూడా ఇలాంటి పనులు చాలా చేయగలరు. కానీ వాళ్లని మేం ఏమాత్రం ప్రోత్సహించం. ఎందుకంటే ఒకరి భవిష్యత్తును గురించి చెప్పడం వల్ల, వారి జీవితాన్ని మనం ఏ మాత్రమూ మార్చలేము. వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి అది ఏమాత్రం తోడ్పడదు. పైగా అది ఒక రకంగా వారిని మరింత అజ్ఞానంలోకి నెట్టడమే అవుతుంది. నిజంగా రేపటి గురించి మీకు తెలిసిపోయిందనుకోండీ... మీరు మరింత అజ్ఞానిగా, అహంకారిగా, దుర్మార్గుడిగా మారిపోతారు. నిజంగా రేపన్నది మీకు తెలిసిపోతే, ఇవాల్టి క్షణాన్ని మీరు అనుభవించలేరు. ఉదాహరణకు మీరు ఏం చేసినా చావు రాదని చెప్పాననుకోండి, ప్రపంచంలోని ప్రతి మూర్ఖమైన పనినీ మీరు చేస్తారు. లేదా మీరు ఏం చేసినాగానీ రేపు ఉదయానికి చనిపోతారని చెబితే.... ఇవాల్టి క్షణం మీదే విరక్తి కలుగుతుంది. ఇంతకీ అవతలివారి భవిష్యత్తు గురించి ఎవరన్నా చెప్పగలరా అంటే తప్పకుండా చెప్పగలరు! కానీ అది ఎప్పుడూ నూటికి నూరు శాతం నిజమవ్వాలని లేదు.

ఈ సృష్టిలో ప్రతి వస్తువుకీ మీ మీద ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు నా పక్కనే పెట్టుకుని ఉండే రాగి చెంబుని తీసుకుంటే, దానికి ఉండే లక్షణాల వల్ల నా మీద ఎంతో కొంత ప్రభావం చూపుతోంది. కానీ ఆ రాగి పాత్ర నా మీద పూర్తిగా ప్రభావం చూపేందుకు నేను అనుమతించడం మొదలుపెడితే... నిదానంగా నేను కూడా ఆ రాగిపాత్రలాగే మారిపోతాను. ఇదేమీ వింత కాదు. అలా పాత్రలుగా మారిపోయినవారిని ఎందరినో మనం గమనించవచ్చు. తమ దగ్గర ఉన్న వస్తువుల ప్రభావంలో వారు ఎంతగా మునిగిపోయారంటే, చివరికి వాళ్లు ఆ వస్తువుల్లాగానే మారిపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీ చుట్టూ ఉండే వస్తువుల ప్రభావం మీ మీద చూపేందుకు అనుమతించేస్తారా? గ్రహాలు కూడా అంతే! అంత పెద్ద ఖగోళ వస్తువులు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు, అవి ఎంతోకొంత ప్రభావాన్ని ఏదో ఒక రకంగా మన మీద చూపుతూనే ఉంటాయి. పౌర్ణమి, అమావాస్యల రోజుల్లో మానసిక బలహీనతలు ఉన్నవారు కొంత విపరీతంగా ప్రవర్తించడాన్ని గమనిస్తుంటాం. ఆ రోజుల్లో సముద్రం సైతం వింతగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ మానసికంగా దృఢంగా ఉన్నవారికి, చంద్రుడు ఏ స్థితిలో ఉన్నా పెద్దగా తేడా కనిపించదు.

మీ జీవిత లక్ష్యం, గమ్యం ఏమిటన్నది మీరే నిర్ణయించుకోవాలి. జీవితంలో మీ చుట్టూ ఉన్నవాటి ప్రభావం తప్పకుండా మీమీద ఉంటుంది. కానీ ఆ ప్రభావానికి మీరు ఎలా స్పందిస్తున్నారన్నది పూర్తిగా మీ మీదనే ఆధారపడి ఉంటుంది! ప్రతి ప్రభావానికి అటూఇటూ కొట్టుకుపోతూ ఉంటే ఎలా? మీలో సాక్షాత్తూ ఆ భగవంతుని అంశ ఉన్నప్పుడు, చలనరహితమైన వస్తువులన్నీ మీ మీద పనిచేసేందుకు, మీరెందుకు అనుమతినివ్వాలి? ఇలాంటి నమ్మకమే కనుక మీలో ఉంటే, మీ జీవితం అద్భుతంగా సాగడాన్ని గమనిస్తారు. తారలు, గ్రహాలు వాటికి కావల్సిన చోటకి వెళ్లనివ్వండి! మీరు మాత్రం మీరు కోరుకున్న చోటకే వెళ్తారు!’
(సద్గురు జగ్గీవాసుదేవ్‌ చేసిన ఒక ఆంగ్ల ఉపన్యాసం ఆధారంగా)

Monday, May 30, 2016

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి?చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

Advertisement

AD DESCRIPTION
AD DESCRIPTION
 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2016. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top