fvz

Tuesday, July 11, 2017

YS Jagan Announces 9 Special Schemes



1. వైఎస్సార్‌ రైతు భరోసా
ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50 వేలు ఇస్తాం. ఏటా మేలో నాలుగేళ్ల పాటు రూ.12,500 లను ఇస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి. 
(లబ్ధి పొందనున్న రైతు కుటుంబాలు: 66 లక్షలు)

2. వైఎస్సార్‌ ఆసరా
అక్కా చెల్లెమ్మల్లారా.. ఈ రోజు వరకు మీకున్న డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే పూర్తిగా మాఫీ చేసి 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం. అక్షరాలా 15 వేల కోట్లు మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలిస్తాం. 
(లబ్ధి పొందనున్న డ్వాక్రా మహిళల సంఖ్య: 89 లక్షలు)

3. పింఛన్ల పెంపు
ప్రతి అవ్వాతాతకి, వికలాంగులకు ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్‌ రూ.1000 నుంచి 2000 పెంచి పక్కాగా అందిస్తాం. 

(లబ్ధిదారుల సంఖ్య: 45 లక్షలు)

4. అమ్మఒడి
పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లీ భయపడొద్దు. ఇంట్లో ఇద్దరి పిల్లలకు.. 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ. వెయ్యి, 6 నుంచి 10వ తరగతి దాకా రూ.1500, ఇంటర్‌ చదువులకు 2000 తల్లులకు అందిస్తాం. 

(లబ్ధి పొందనున్న విద్యార్థులు: 40 లక్షలు)

5. పేదలందరికీ ఇళ్లు
పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం.  ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖాపెట్టి పావలావడ్డీకే రుణం. 

(లబ్ధి పొందనున్న కుటుంబాలు: 25 లక్షలు)

6. ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం
ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం.  సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బతకడానికి డబ్బులు అందిస్తాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా పింఛన్‌. 

(లబ్ధి పొందనున్న కుటుంబాలు : 1.38 కోట్లు)

7. ఫీజు రీయింబర్స్‌మెంట్‌
పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20 వేలు అందిస్తాం. 

(లబ్ధి పొందనున్న విద్యార్థులు : 15.80 లక్షలు)

8. జలయజ్ఞం
దివంగత మహానేత వైఎస్‌ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతాం.

( అదనంగా  సాగు నీరు అందేది : 56 లక్షల ఎకరాలకు)
9. దశల వారీగా మద్య నిషేధం
కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. 

(రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనకరమే)

మద్య నిషేధం ఇలా..
అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యం ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతోంది. ఈ కారణంగా ఎన్ని జీవితాలు సర్వనాశనమవుతున్నాయో నాకు తెలుసు. రోడ్ల మీద జరిగే ప్రమాదాలే కాదు.  మద్యం కారణంగా లక్షల ఇళ్లల్లో మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మద్య నిషేధం అన్నది ఒక్కరోజులో అమలు సాధ్యం కాదు. ఈ వాస్తవం అర్ధం చేసుకోబట్టే మూడు దశల్లో ఈ పని చేస్తానని, అందరి కుటుంబాలకు వెలుగులు ఇస్తానని మాట ఇస్తున్నా.     –వైఎస్‌ జగన్‌

1. దుకాణాల సంఖ్య తగ్గించి అదే సమయంలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతాం. మొదటి దశలోనే మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతాయన్నది సినిమా, టీవీల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తాం. మద్యం నిషేదం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలోనే మీడియాకు ఉంది. వారందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరలను షాకు కొట్టేలా పెంచుతాం.

2. మద్యం ధరలు పేద, మద్య తరగతి వారికి అందుబాటులో లేకుండా ఇంకా ఇంకా షాకు కొట్టేలా పెంచుతాం. మద్యం తాగితే కలిగే నష్టాలు, మద్యం తాగకుండా వచ్చేలాభాలను మరింత ఎక్కువగా మీడియా ద్వారా ప్రచారం చేస్తాం. ధూమ పాన వ్యతిరేక ప్రచారం మాదిరి మద్యపాన నిషేదించడానికి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, ఉన్నత న్యాయస్థానాలు పూనుకునేలా వారిని ఒప్పించడానికి అడుగులు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబిలిటేషన్‌ సెంటర్లు పెట్టి మద్యం మానుకోవడానికి ముందుకొచ్చే వారికి వైద్యం అందజేసి, వారికి తోడుగా నిలబెడతాం.

3. మద్యాన్ని కోటీశ్వర్లు మాత్రమే కొనుగొలు చేసేలా మద్యాన్ని ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్‌ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్లి వైద్యం చేసుకునే స్థోమత ఉన్న వారికే మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్లే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించేలా రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాలు తెస్తాం. మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేలా.. ఏడేళ్లు పాటు జైలుకు పోయేలా చట్టాలను మారుస్తాం. ఈ మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉండాలని చేస్తా ఉన్నాం.



Sunday, February 26, 2017

మమేకమైన మనపైనే విద్వేషం





ఎన్నో ఏళ్లుగా శాంతియుత సహజీవనం, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అమెరికా వృద్ధికి బాసట...  అయినా విడదీసి చూసే సంస్కృతి !

అమెరికా అంటే మన స్వగృహం లాంటిది.. అక్కడ అపార అవకాశాలున్నాయ్‌.. నైపుణ్యమున్న వారికి అక్కడ అగ్రతాంబూలం.. అదే ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకూ సగటు భారతీయుడు అమెరికా వైపు చూస్తున్నాడు. ఎంతో శ్రమకోర్చి అక్కడ అడుగుపెట్టి.. అహరహం శ్రమిస్తున్నాడు. అమెరికా సమాజంలో శాంతియుత సహజీవనం చేస్తున్నాడు. సంపద సృష్టిస్తున్నాడు. అయినా తనను వేరు చేసి చూడటాన్ని భరించలేకపోతున్నాడు. అగ్రరాజ్యంలో మారిన పరిస్థితులను
జీర్ణించుకోలేకపోతున్నాడు.


భారతీయులు అమెరికా వెళ్లడం 1960 నుంచి మొదలైంది. వియత్నాం యుద్ధం పర్యవసానంగా అమెరికాలో వైద్యులకు గిరాకీ ఏర్పడింది. దీంతో 1960-70 మధ్యకాలంలో మనదేశం నుంచి వైద్యులు, ఇంజినీర్లు అమెరికా వలస వెళ్లారు. ఆతర్వాత కూడా ఉన్నతావకాశాల కోసం వెళ్లినవారెందరో. 1990 తర్వాత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం పరిస్థితిని సమూలంగా మార్చివేసింది. లెక్కలు, ఆంగ్ల భాషలో పట్టు ఉన్న భారతీయులు అమెరికన్లకు ఎంతగానో అవసరమయ్యారు. దీంతో ఒక్కసారిగా అమెరికా వెళ్లే భారతీయ నిపుణుల సంఖ్య అధికమైంది. గుజరాతీయులు, పంజాబీలు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం వెళ్తే.. తెలుగువారు మాత్రం అధికంగా ఐటీ నిపుణులుగా అక్కడ అడుగుపెట్టారు. అక్కడి సమాజంలో మమేకం అయిపోయారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సామాజిక కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఎదిగారు. రాజకీయ క్షేత్రంలో తమదైన శైలి కనబరిచారు. శాంతి సామరస్యాలతో జీవించడంతో పాటు నిరంతర శ్రమకు పర్యాయపదం అయ్యారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా మారిపోయారు. భారతీయుల తెలివితేటలు, కష్టించే మనస్తత్వం అమెరికన్లనూ ఆకట్టుకున్నాయి. గత రెండు మూడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో మనలో అమెరికా అంటే పరాయి దేశం అనే భావన పోయింది. ఇంతగా అనుబంధం పెనవేసుకున్న దేశంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు సగటు భారతీయుడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ నిపుణులను అధికంగా అమెరికాకు అందిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం ఎంతో కలత చెందుతోంది.

రెండుమూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో భారతీయలపై వరుస దాడులు జరిగాయి. అటువంటి పరిస్థితి అమెరికాలోనూ వస్తుందని ఎవరూ వూహించలేదు. అనుకోనివిధంగా జరిగిన ఘర్షణలు, ప్రమాదాల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి కానీ ‘నువ్వు పరాయి దేశానికి చెందినవాడివి’ అనే ద్వేషంతో ప్రాణాలు బలిగొన్న సంఘటనలు లేవు. ఈ పరిస్థితికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలే కారణమనేది నిర్వవాదాంశం. ఎన్నికల ప్రచారం నాటి నుంచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తర్వాత కూడా అమెరికా ఫస్ట్‌, వలసలు అరికడతా, మన ఉద్యోగాలు మనకే... అని ద్వేషాన్ని రెచ్చగొట్టే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. అదే భారతీయుల పాలిట శాపంగా మారుతోంది.


భారతీయులే విద్యాధికులు 
అమెరికా అత్యధికంగా వెళ్లేవారిలో చైనీయుల సంఖ్య అధికంకాగా, ఆ తర్వాత స్థానం మనదే. ఇంకా కొరియా, జపాన్‌, వియత్నాం, పాకిస్థాన్‌, నేపాల్‌ తదితర దేశాల నుంచి వెళ్లేవారూ ఉంటున్నారు. కానీ చదువు విషయానికి వచ్చేసరికి భారతీయ అమెరికన్లదే పైచేయి. 2013 గణాంకాల ప్రకారం అమెరికాలోని భారతీయుల్లో 76 శాతంమంది బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ కలిగి ఉన్నారు. ఇతర దేశాల సగటు చూస్తే 28 శాతం మాత్రమే.


సిలికాన్‌ వ్యాలీలో...

* ఐటీ పరిశ్రమకు కేంద్ర స్థానమైన సిలికాన్‌వ్యాలీలో భారతీయ నిపుణులు అడుగుపెట్టటం 1970-80 మధ్య కాలంలోనే ప్రారంభమైంది. వై2కే (2000 సంవత్సరం) నాటికి ఇది గరిష్ఠ స్ధాయికి చేరింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఐటీ సంస్థల్లో 15.5 శాతం భారతీయులు ప్రారంభించినవే. చైనా, బ్రిటన్‌, తైవాన్‌, జపాన్‌ దేశస్థులు భారత్‌ తరువాత స్థానంలో ఉన్నారు.

* సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ సంస్థలను స్థాపించడంతో పాటు.. సీఈవోలు, వైస్‌ ప్రెసిడెంట్‌లు వంటి ఉన్నత స్థానాల్లో పలువురు భారతీయులు ఉన్నారు.

* హాట్‌మెయిల్‌ సృష్టికర్త సబీర్‌ భాటియా భారతీయుడే. 

* సన్‌ మైక్రోసిస్టమ్స్‌ సహవ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా నుంచి నేటి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వరకూ సిలికాన్‌ వ్యాలీలో భారతీయులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

* పెంటియమ్‌ చిప్‌ల సృష్టికర్త వినోద్‌ ధామ్‌ కూడా భారతీయుడే.

సంపాదనపరులూ మనోళ్లే... 

ఎక్కువ గంటలు పనిచేస్తారు.. ఇంటిదగ్గర నుంచి పనిచేయమన్నా చేస్తారు. శనివారం, ఆదివారం, సెలవు రోజైనా పనికి సిద్ధమే. అదే సమయంలో ఖర్చులు తక్కువ, పొదుపు ఎక్కువ. విదేశాల నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన వారిలో అధికాదాయం కలవారు భారతీయులే. సగటు అమెరికన్‌ సంపాదన ఏడాదికి 53,000 డాలర్లు ఉంటే, విదేశాల నుంచి వచ్చిన వారి సగటు ఆదాయం 48,000 డాలర్లు ఉంటుంది. అదే భారతీయుల సంపాదన మాత్రం ఏడాదికి ఒక లక్ష డాలర్లకు పైగానే ఉండటం గమనార్హం. విదేశాల నుంచి అమెరికా వలస వచ్చిన వారిలో పేదల సంఖ్య అతి తక్కువగా ఉన్నది కూడా భారతీయుల్లోనే.


రాజకీయ క్షేత్రంలో... 

కేవలం ఉద్యోగాలు, వ్యాపారానికే పరిమితం కాకుండా భారతీయులు అక్కడి సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వంలో కీలకమైన స్ధానాల్లో పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ సభ్యుడిగా, లూసియానా గవర్నర్‌గా వ్యవహరించిన బాబీ జిందాల్‌ ఇటీవల అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్‌ పార్టీ నామినేషన్‌ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అమీ బేరా, ఉపేంద్ర చివుకుల, స్వాతి దండేకర్‌, రాజా కృష్ణమూర్తి, కమలా హారిస్‌, ప్రమీలా జయ్‌పాల్‌... ఇలా చూస్తే అతిపెద్ద జాబితాయే ఉంది.

* 1948 నుంచి 2016 మధ్య అమెరికాలో విదేశీ విద్యార్థులు 41 రెట్లు పెరిగారు. 

* అమెరికాలో మొత్తం విద్యార్థుల్లో విదేశీయులు.
* అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీ విద్యార్థుల వల్ల సమకూరుతున్న మొత్తం: 3,500 కోట్ల డాలర్లు

* 2015-16లో విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమకూరింది: 2 లక్షల కోట్ల డాలర్లు 

* అక్కడకు విదేశాల నుంచి వచ్చినవారిలో భారతీయులే అత్యధికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ పన్ను రూపంలో భారీగా ఆదాయం అందిస్తున్నారు. 

* భారతీయులు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ప్రధానమైనవి: రవాణా, వసతి, వినోదం, ఆతిథ్య, ఆహార రంగాలు. 

* అనేక వృత్తులను విదేశీయులే చేపట్టడం వల్ల మానసిక, శారీరక ఒత్తిళ్లు తగ్గి అమెరికా ప్రజల ఆయుఃప్రమాణాలు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

1948: 1.1 శాతం 
2016: 5.2 శాతం 





Monday, January 09, 2017

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?!

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?!
  • ఏషియన్‌ పసిఫిక్‌ రీసెర్చ్‌ సంచలన నివేదిక l
  • అమెరికా సంస్థల హితం కోసమే నగదు రహితం!
భారత్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. అమెరికా ప్రణాళికలో అంతర్భాగమా? ప్రపంచ ఆర్థిక రంగాన్ని నగదు రహితంగా మార్చి తన గుప్పెట్లో ఉంచుకుని శాసించే కుట్రలో భాగంగా.. భారతావని మొత్తాన్నీ తొలి ప్రయోగ వేదికగా చేసుకున్నారా? అమెరికా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు, వీసా, మాస్టర్‌ కార్డ్‌ వంటి ఆర్థిక సంస్థల హితం కోసమే.. కోట్లాది మంది ప్రజలను కష్టాల పాలు చేస్తూ మన దేశాన్ని ఆకస్మికంగా నగదు రహితంగా మార్చారా? నల్లధనం ఏరివేత, అవినీతి అంతం కోసం కొంత కాలం కష్టాలను ఓర్చుకోండి అంటూ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసింది అమెరికా కుట్రపూరిత ఎజెండానేనా? అవుననే చెప్తోంది ఏషియన్‌ పసిఫిక్‌ రీసెర్చ్‌ (ఏపీఆర్‌) సంస్థ. ‘చక్కగా దాచిన బహిరంగ రహస్యం: భారతదేశ క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనుక అమెరికా’ శీర్షికతో ఏపీఆర్‌ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలివీ...  


అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన విదేశాంగ విధానంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక ప్రాధాన్యతాంశంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ ఎయిడ్‌) భారత ఆర్థికశాఖతో పలు సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో.. భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం ఒక లక్ష్యంగా ప్రకటించారు. ఆ దిశగా ఏడాది కిందటి నుంచి ఆర్బీఐ అధికారులు, ఆర్థికశాఖ పెద్దలతో యూఎస్‌ఎయిడ్‌ చర్చలు జరిపింది.

భారత్‌లో నగదు రహిత లావాదేవీలకు ఉన్న అడ్డంకులపై గత ఏడాది జనవరిలోనే యూఎస్‌ ఎయిడ్‌ నివేదిక రూపొందించింది. ‘బియాండ్‌ క్యాష్‌’ అనే పేరుతో చేసిన ఆ నివేదికలో.. దేశంలో 97% లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయని, కేవలం 55% మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అందులోనూ 29% ఖాతాలనే గత మూడు నెలల్లో ఉపయోగించారంది. ‘వ్యాపారులు, వినియోగదారులు నగదు వ్యవస్థల్లో చిక్కుకుపోయారు. అది డిజిటల్‌ చెల్లింపులపై వారికి ఆసక్తి కలగకుండా నిరోధిస్తోంది. కొద్దిమంది వ్యాపారులే డిజిటల్‌ చెల్లింపులను అంగీకరిస్తారు కనుక.. దానిపై కొద్దిమంది వినియోగదారులకే ఆసక్తి ఉంటుంది. కార్డు వినియోగం ఒకస్థాయిలో చొచ్చుకుపోయేలా చేయడానికి బయటి నుంచి ఒత్తిడి అవసరం’ అని విశ్లేషించింది.

రద్దుకు నాలుగు వారాల ముందు..
నవంబర్‌ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటించడానికి 4 వారాల ముందు.. భారత్‌లో నగదు రహిత చెల్లింపులను భారీస్థాయిలో పెంచేయడం లక్ష్యంగా ‘క్యాటలిస్ట్‌: సంఘటిత నగదు రహిత చెల్లింపు భాగస్వామ్యం’ అనే పథకాన్ని యూఎస్‌ ఎయిడ్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 14వ తేదీన జారీ చేసిన ఆ పత్రికా ప్రకటనలో.. ‘సార్వజనీన ఆర్థిక సంఘటితంలో యూఎస్‌ ఎయిడ్‌ – భారత ఆర్థిక మంత్రిత్వశాఖల మధ్య భాగస్వామ్యం తర్వాతి దశకు క్యాటలిస్ట్‌ ఒక మైలురాయి’ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో యూఎస్‌ ఎయిడ్, ఐఎంఎఫ్, వీసా, మాస్టర్‌ కార్డ్, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్, పేటీఎం, ఫోన్పే, ఫ్రీచార్జ్, ఈబే, స్నాప్‌డీల్‌  వంటి 35 ప్రపంచ ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్‌ చెల్లింపు సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ క్యాటలిస్ట్‌ ప్రాజెక్ట్‌ ఇంక్యుబేషన్‌ డైరెక్టర్‌ అలోక్‌ గుప్తా.. వాషింగ్టన్లో వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్లా పనిచేశారు. దాని ప్రధాన ప్రాయోజక సంస్థల్లో యూఎస్‌ ఎయిడ్‌ ఒకటి. ఇక భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆన్‌లైన్‌ విక్రయాల వెబ్‌ సైట్‌ స్నాప్‌డీల్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బాదల్‌ మాలిక్‌.. క్యాటలిస్ట్‌ సీఈఓ గా నియమితులయ్యారు. ‘ఆర్థికవ్యవస్థలను డిజిటలైజ్‌ చేయడానికి, చేరుకోవడం కష్టతరమైన ప్రజానీకానికి విస్తరించే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి చేస్తున్న కృషిలో భారతదేశం ముందు వరుసలో ఉంది’ అంటూ యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా మిషన్‌ డైరెక్టర్‌ జొనాథన్‌ అడిల్టన్‌ అక్టోబర్‌ 14న చేసిన ప్రకటన.. ఆ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి పరోక్షంగా చేసిన ప్రకటనేనని ఏపీఆర్‌ అభివర్ణించింది.

ప్రయోగాత్మకంగా అన్నారు కానీ..
తొలుత నిర్దిష్ట ప్రాంతాన్ని లేదా నగరాన్ని ఎంపిక చేసి.. అక్కడ నగదురహిత లావాదేవీలను భారీగా పెంచే కార్యక్రమం చేపడతామని.. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, స్థానిక ఆర్థిక వ్యవస్థ, పాలనా సౌలభ్యం తదితర ప్రమాణాల ప్రకారం ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయటం జరుగుతుందని ఆ ప్రకటనలో వివరించారు. అయితే.. 4 వారాలు గడవక ముందే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పెద్దనోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనం, అవినీతిపై పోరాటం కోసమే ఈ చర్య చేపట్టినట్లు తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే ‘నగదు రహితం’ వైపు మళ్లాలని దేశ ప్రజలకు ఉద్భోదించటం మొదలు పెట్టారు.

ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న 86% నగదు ఒక్కసారిగా చెల్ల కుండాపోవడంతో ప్రజలు డిజిటల్‌ లావాదేవీల వైపు ప్రయాణించక తప్పని పరిస్థితి కల్పించారు. దీంతో.. ఊహించినట్లుగానే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డా కానీ.. డిజిటల్‌ లావాదేవీలు ఆశించినట్టుగానే అనూహ్యంగా పెరిగిపోయాయి. మరోవైపు.. రద్దు చేసిన నగదు స్థానంలో పూర్తి మొత్తాన్ని మార్కెట్లోకి విడుదల చేయకుండా నగదు లభ్యతను పరిమితం చేసి, ఖాతాదారులకు బ్యాంకులు ఇచ్చే నగదుపై ఆంక్షలు విధించి డిజిటల్‌ లావాదేవీలను పెంచే ప్రణాళిక అమలు చేస్తున్నారు.

అమెరికా గుప్పిట్లో ఆర్థిక రంగం
ప్రపంచంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత చెల్లింపుల సేవలు అందించే అమెరికా కంపెనీల వ్యాపారాలను విస్తరించడానికి ఈ చర్య దోహదపడుతుంది. డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందించే వీసా, మాస్టర్‌కార్డ్, పేటీఎం వంటి సంస్థల వ్యాపారాలు, లాభాలూ విస్తరిస్తాయి. డిజిటల్‌ చెల్లింపులు పెంచడంతో పాటు అమెరికా నిఘా శక్తిని విస్తృతం చేయడమూ నగదుపై యుద్ధానికి మరో ముఖ్యకారణంగా ఏపీఆర్‌ చెప్తోంది. అమెరికా నిఘా సంస్థలు, ఐటీ కంపెనీలు కలసి.. డిజిటల్‌ సమాచారంపై నిఘా పెట్టగలవు. ఆర్థిక సమాచారం ముఖ్యంగా మారుతుంది. అంతకంటే ముఖ్యమైనది.. ప్రపంచ కరెన్సీగా అమెరికా డాలరుకు గల హోదా వల్ల కూడా.. నగదు రహిత వ్యవస్థలో పాలుపంచుకునే వారందరినీ తన గుప్పిట్లో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. ఎవరైనా సరే స్థానిక, అంతర్జాతీయ చట్టాలకు కాకుండా అమెరికా చట్టాలను పాటించేలా ఒత్తిడి తెచ్చి, బెదిరించే స్థాయిలో ఉంటుందని, బ్యాంకులు, ప్రభుత్వాలు అమెరికా చేతుల్లో ఉంటాయని ఏపీఆర్‌ విశ్లేషించింది.

నోట్లరద్దుకు కారణాలేంటి?

పీఏసీ సంధించిన ప్రశ్నలు

 నోట్లరద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ, ఆర్బీఐ బోర్డు తీసుకున్నాయని.. దీనికి ప్రభుత్వం ఆమోదం మాత్రమే తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో తెలిపారు. దీంతో మీరు ఏకీభవిస్తారా?

 ఒకవేళ ఇది ఆర్బీఐ ఆలోచనే అయితే.. ఎప్పుడు నోట్లరద్దుపై చర్చించి నిర్ణయం తీసుకుంది?

► రాత్రికి రాత్రి నోట్లరద్దు చేయాలనే నిర్ణయం వెనక ఆర్బీఐ చూపించే అసలైన కారణమేంటి?

► భారత జీడీపీలో నగదు 12 శాతం (జపాన్‌ 18, స్విట్జర్లాండ్‌ 13). భారత కరెన్సీలో పెద్ద నోట్లు 86 శాతం ఉంటే.. చైనాలో 90 శాతం, అమెరికాలో 81 శాతం. ఇలాంటప్పుడు భారత్‌లోనే అత్యవసరంగా నోట్లరద్దు నిర్ణయం తీసుకోవటం వెనక ఉన్న కారణాలేంటి?

► నవంబర్‌ 8న అత్యవసర సమావేశం కోసం ఆర్బీఐ బోర్డు సభ్యులకు ఎప్పుడు నోటీసులు పంపారు? వీరిలో ఎందరు సమావేశానికి హాజరయ్యారు? మీటింగ్‌ మినిట్స్‌ (చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు) ఎక్కడున్నాయి?

► కేబినెట్‌ ఆమోదం కోసం పంపిన లేఖలో.. నోట్లరద్దు వల్ల 86% కరెన్సీ చెల్లకుండా పోవటం, దీని మొత్తం విలువ వంటివి ప్రత్యేకంగా పేర్కొన్నారా? రద్దయిన నోట్ల మొత్తం విలువను చలామణిలోకి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుంది?

► ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 3 సీ(వీ) ప్రకారం.. విత్‌డ్రా పరిమితిపై  ఆంక్షలు విధిస్తున్నట్లు నవంబర్‌ 8న ప్రకటన ఇచ్చారు. ఆర్బీఐలోని ఏ చట్టం ప్రకారం ప్రజలపై విత్‌డ్రా పరిమితి విధించారు? ఆర్బీఐకి ఈ అధికారం ఉందా? అలాంటి చట్టాలేమీ లేకపోతే.. అధికార దుర్వినియోగం చేసినందుకు మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోనుంచి తొలగించరాదు?

► రెండు నెలలుగా ఆర్బీఐ నియమాల్లో ఎందుకు త్వరత్వరగా మార్పులు జరిగాయి? ప్రజల విత్‌డ్రాయల్‌ నియంత్రణపై సలహా ఇచ్చిన అధికారి పేరును తెలపండి. వివాహ సంబంధిత విత్‌డ్రాయల్స్‌ నిబంధనలను రాసిందెవరు? ఒకవేళ ఆర్బీఐ కాకుండా ప్రభుత్వమే దీన్ని రాసిస్తే.. మరి ఆర్బీఐ ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగంగా మారిందనుకోవాలా?

► రద్దయిన నోట్ల అసలైన లెక్క ఎంత? బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన పాతనోట్ల విలువెంత? నవంబర్‌ 8న ప్రభుత్వానికి నోట్లరద్దు నిర్ణయంపై సూచన చేసినపుడు.. ఎంత మొత్తంలో నోట్లను రద్దుచేయొచ్చని ఆర్బీఐ భావించింది?

► నోట్లరద్దుపై వివరాలు చెప్పాలంటూ దాఖలైన ఆర్టీఐ ఫిర్యాదులకు సమాధానం ఇచ్చేందుకు ఆర్బీఐ ఎందుకు విముఖత వ్యక్తం చేసింది?


Saturday, January 07, 2017

స్కోరుంటేనే రుణం!

స్కోరుంటేనే రుణం!
బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు చెక్‌
 సిబిల్‌ నివేదిక, స్కోరు ఆధారంగానే అన్ని రుణాలు
♦ రూ. 50 వేలపైన ప్రతి రుణ మంజూరుకు 700 స్కోరైనా ఉండాలి
 వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా అమలు
 అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
 నిరర్థక ఆస్తుల అడ్డుకట్టకు ఇదే మార్గమని స్పష్టీకరణ
ఖాతాదారులకు ఏడాదికి మూడుసార్లు ఉచితంగా సిబిల్‌ నివేదిక!


క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) స్కోరుతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు అడ్డుకట్ట వేసింది. రూ. 50 వేలకు పైన రుణ మంజూరుకు సంబంధించి తప్పనిసరిగా సిబిల్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని, కనీసం 700 పైన స్కోరు ఉన్న వారికే రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక సిబిల్‌ పరిధిలోకి రావాలని అన్ని రకాల సహకార బ్యాంకులకూ సూచించింది. రైతులు తీసుకునే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు, చెల్లింపు ప్రక్రియను సిబిల్‌లో నమోదు చేసేలా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ బ్యాంకులను ఆదేశించింది.

ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా..
అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఇప్పటికే రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సిబిల్‌తో అనుసంధానం చేశారు. రుణాల మంజూరుకు సిబిల్‌ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు దీనిని నూరు శాతం అమలు చేస్తున్నా... ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఎక్కువసార్లు మేనేజర్ల విచక్షణాధికారం మేరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే వచ్చే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కచ్చితంగా సిబిల్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకోవాల్సిందే. ఈ స్కోరు 700లోపు ఉన్న ఖాతాదారులు బ్యాంకుకు ఎంత ప్రాధాన్యత కలిగిన వారైనా.. రుణ దరఖాస్తును తదుపరి పరిశీలనకు తీసుకోరు. నోట్ల రద్దుతో బ్యాంకులకు భారీగా నగదు వచ్చి చేరడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బ్యాంకులకు వచ్చిన నగదును పరపతి సరిగా లేని ఖాతాదారులు, రుణాలు తీసుకుని తరచూ ఎగవేసేవారికి ఇచ్చే అవకాశం లేకుండా త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనుంది.

అన్ని రుణాల మంజూరుకూ..
వ్యక్తిగత అవసరాలకు తీసుకునే రుణాలతో పాటు ఇంటి, వాహన, విద్య, ఆస్తి తాకట్టు రుణాలకు కూడా సిబిల్‌ స్కోరే ప్రామాణికం కానుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం... ఏ ఖాతాదారుడైనా రుణానికి దరఖాస్తు చేసినప్పుడు ముందుగా వారి సిబిల్‌ స్కోరును పరిశీలిస్తారు. స్కోరు 700 కంటే తక్కువగా ఉంటే దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరిస్తారు. 700 దాటి ఉంటే రుణ మంజూరుకు అవసరమైన ఇతర పరిశీలన నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విషయంలో బ్రాంచ్‌ మేనేజర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. ప్రస్తుతమున్నట్లుగా దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడానికి బ్యాంకు మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అంగీకరించదు.

స్కోరు ఎక్కువగా ఉన్నా..
సిబిల్‌ స్కోరు 700–750 మధ్య ఉన్న ఖాతాదారులకు సంబంధించి అన్ని లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రుణాలు ఎగవేయడం, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లు చేసుకోవడం వంటివి కనిపిస్తే.. అర్హతలున్నా అడిగినంత రుణం ఇవ్వరు. కొంత రుణమిచ్చి తరువాత వారు చెల్లించే విధానాన్ని బట్టి అదనపు రుణం ఇస్తారు. స్కోరు 750–850 మధ్య ఉంటే దరఖాస్తుదారు అర్హతలను బట్టి 48 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. ఏవైనా కంపెనీలు నిరర్థక ఆస్తుల జాబితాలో ఉంటే.. ఆ కంపెనీని నిర్వహిస్తున్న వారికి కూడా రుణం ఇవ్వరు. ఆ కంపెనీ డైరెక్టర్లు, ఉన్నత హోదాల్లో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. విదేశాల్లో తమ పిల్లలను చదివించాలనుకునేవారు వ్యక్తిగత ఆస్తులను తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వీలుంది. అయితే సదరు విద్యార్థి తల్లి లేదా తండ్రి సిబిల్‌ స్కోరు సరిగా లేనిపక్షంలో రుణ దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరిస్తారు. పరిచయమున్న బ్యాంకు మేనేజర్‌ లేదా సీనియర్‌ అధికారి తెలిస్తే ఇప్పటిదాకా ఈ నిబంధనను పెద్దగా పట్టించుకునేవారు కాదు.

‘రియల్‌’కు ఇబ్బందిగా మారిన సిబిల్‌
తెలిసీ తెలియక క్రెడిట్‌ కార్డులు ఎడాపెడా వాడేసి సకాలంలో తిరిగి చెల్లించకపోతే సిబిల్‌ స్కోరు 500–600 మధ్య ఉంటుంది. ఇంటి రుణాలకు సంబంధించి బ్యాంకులు ఇప్పటికే 75 శాతం సిబిల్‌ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దీంతో 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. నెలకు రూ.లక్ష వేతనం సంపాదించే ఉద్యోగులు సైతం సిబిల్‌ స్కోరు లేకపోవడం వల్ల ఇంటిరుణాలు పొందలేకపోతున్నారు. ‘‘మా బ్యాంకుకు నిత్యం 250 నుంచి 300 రుణ దరఖాస్తులు వస్తాయి. వారంతా ఐటీ కంపెనీల్లో మంచి వేతనానికి పని చేసేవారే. కానీ వారి సిబిల్‌ స్కోరు సరిగా లేని కారణంగా 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి..’’అని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజర్‌ ఒకరు చెప్పారు.

ప్రస్తుతం సిబిల్‌ స్కోరు ఆశించిన స్థాయిలో లేకపోయినా తమ విచక్షణాధికారంతో కొంతమందికి రుణం ఇప్పించగలుగుతున్నామని.. ఇకపై అలాంటి అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి దీనిని కచ్చితంగా అమలు చేస్తే దాని ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పై పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎడాపెడా క్రెడిట్‌ కార్డులు ఇవ్వడం, అత్యధిక మొత్తంలో వడ్డీలు విధించడంతో వినియోగదారులు బ్యాంకులతో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల విషయంలో సిబిల్‌ స్కోరు ప్రభావితం కాకుండా చూడాలని బ్యాంకర్లే కోరుతున్నారు. వ్యక్తిగత రుణం మరేదైనా రుణం తీసుకుని ఎగవేసిన వారు, ఎన్‌పీఏల్లో చేరిన వారి విషయంలో తాము ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు సిబిల్‌ స్కోరును కచ్చితంగా పాటించాల్సి వస్తే రుణ దరఖాస్తుల తిరస్కరణ భారీగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.

ఏడాదికోసారి ఉచితంగా..!
ఏ బ్యాంకు నుంచైనా రుణం లేదా క్రెడిట్‌ కార్డు తీసుకున్న వారికి ఏడాదిలో మూడు సార్లు ఉచితంగా సిబిల్‌ నివేదిక ఇవ్వాలని రిజర్వు బ్యాంకు గతంలోనే సూచించింది. అది అమల్లోకి రాలేదు. ప్రస్తుతానికి ఏడాదిలో ఒకసారైనా ఉచితంగా ఇవ్వాలన్న నిబంధనను కూడా సిబిల్‌ అమలు చేయడం లేదు. సిబిల్‌ నివేదిక కావాలనుకునేవారు రూ.550 చెల్లించాల్సిందే, అదీ ఒక్కసారికే. సాధారణంగా సిబిల్‌ నివేదికను చూస్తే తప్ప వినియోగదారుడు తన తప్పునుగానీ, ఆర్థిక సేవల సంస్థ చేసే పొరపాట్లనుగానీ సరిదిద్దుకోవడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకోవడానికి సిబిల్‌ స్కోరును ప్రామాణికం చేయాలనుకుంటే... దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరముందని బ్యాంకర్లు చెబుతున్నారు. లేకపోతే రుణాల జారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బంది అవుతుందన్నది వారి ఆందోళన. ‘నోట్ల రద్దు’నేపథ్యంలో బ్యాంకులకు భారీ ఎత్తున నగదు రావడంతో ప్రస్తుతం రుణాలివ్వడానికి అవకాశముంది. అయితే ఈ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

సిబిల్‌ అంటే..
దేశంలో వ్యక్తులు, సంస్థల రుణ చరిత్ర (రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లింపులు)ను నమోదు చేసి... బ్యాంకులు సహా వివిధ ఆర్థిక సేవల సంస్థలకు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ‘క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఇండియా) లిమిటెడ్‌’. దీనినే క్లుప్తంగా సిబిల్‌ అని పిలుస్తారు. దేశంలోని చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు దీనితో అనుసంధానమై ఉంటాయి. ఎవరు ఏ బ్యాంకులో, ఏ ఫైనాన్షియల్‌ సంస్థలో.. ఎలాంటి రుణం తీసుకున్నా సిబిల్‌ రికార్డుల్లోకి చేరుతుంది. ఎంత రుణం తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా తదితర వివరాలను బ్యాంకులు సిబిల్‌కు పంపిస్తుంటాయి. ఆ సమాచారం ఆధారంగా సిబిల్‌ వారికి సంబంధించిన నివేదికలను, స్కోరును అప్‌డేట్‌ చేస్తుంది. తీసుకున్న రుణాలు, క్రెడిట్‌ కార్డులు, తిరిగి చెల్లిస్తున్న విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబిల్‌ స్కోరును నిర్ణయిస్తారు. ఏ ఖాతాదారుడైనా క్రెడిట్‌ కార్డులు, ఇంటి రుణం, వ్యక్తిగత, వాహన రుణాలు, బంగారంపై రుణాల వంటివి తీసుకుని.. సక్రమంగా వాయిదాల చెల్లింపులు చేస్తుంటే సిబిల్‌ స్కోరు పెరుగుతుంది. లేకపోతే స్కోరు తగ్గుతుంది.

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top