fvz

Sunday, February 26, 2017

మమేకమైన మనపైనే విద్వేషం

ఎన్నో ఏళ్లుగా శాంతియుత సహజీవనం, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అమెరికా వృద్ధికి బాసట...  అయినా విడదీసి చూసే సంస్కృతి !

అమెరికా అంటే మన స్వగృహం లాంటిది.. అక్కడ అపార అవకాశాలున్నాయ్‌.. నైపుణ్యమున్న వారికి అక్కడ అగ్రతాంబూలం.. అదే ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకూ సగటు భారతీయుడు అమెరికా వైపు చూస్తున్నాడు. ఎంతో శ్రమకోర్చి అక్కడ అడుగుపెట్టి.. అహరహం శ్రమిస్తున్నాడు. అమెరికా సమాజంలో శాంతియుత సహజీవనం చేస్తున్నాడు. సంపద సృష్టిస్తున్నాడు. అయినా తనను వేరు చేసి చూడటాన్ని భరించలేకపోతున్నాడు. అగ్రరాజ్యంలో మారిన పరిస్థితులను
జీర్ణించుకోలేకపోతున్నాడు.


భారతీయులు అమెరికా వెళ్లడం 1960 నుంచి మొదలైంది. వియత్నాం యుద్ధం పర్యవసానంగా అమెరికాలో వైద్యులకు గిరాకీ ఏర్పడింది. దీంతో 1960-70 మధ్యకాలంలో మనదేశం నుంచి వైద్యులు, ఇంజినీర్లు అమెరికా వలస వెళ్లారు. ఆతర్వాత కూడా ఉన్నతావకాశాల కోసం వెళ్లినవారెందరో. 1990 తర్వాత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం పరిస్థితిని సమూలంగా మార్చివేసింది. లెక్కలు, ఆంగ్ల భాషలో పట్టు ఉన్న భారతీయులు అమెరికన్లకు ఎంతగానో అవసరమయ్యారు. దీంతో ఒక్కసారిగా అమెరికా వెళ్లే భారతీయ నిపుణుల సంఖ్య అధికమైంది. గుజరాతీయులు, పంజాబీలు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం వెళ్తే.. తెలుగువారు మాత్రం అధికంగా ఐటీ నిపుణులుగా అక్కడ అడుగుపెట్టారు. అక్కడి సమాజంలో మమేకం అయిపోయారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సామాజిక కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఎదిగారు. రాజకీయ క్షేత్రంలో తమదైన శైలి కనబరిచారు. శాంతి సామరస్యాలతో జీవించడంతో పాటు నిరంతర శ్రమకు పర్యాయపదం అయ్యారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా మారిపోయారు. భారతీయుల తెలివితేటలు, కష్టించే మనస్తత్వం అమెరికన్లనూ ఆకట్టుకున్నాయి. గత రెండు మూడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో మనలో అమెరికా అంటే పరాయి దేశం అనే భావన పోయింది. ఇంతగా అనుబంధం పెనవేసుకున్న దేశంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు సగటు భారతీయుడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ నిపుణులను అధికంగా అమెరికాకు అందిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం ఎంతో కలత చెందుతోంది.

రెండుమూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో భారతీయలపై వరుస దాడులు జరిగాయి. అటువంటి పరిస్థితి అమెరికాలోనూ వస్తుందని ఎవరూ వూహించలేదు. అనుకోనివిధంగా జరిగిన ఘర్షణలు, ప్రమాదాల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి కానీ ‘నువ్వు పరాయి దేశానికి చెందినవాడివి’ అనే ద్వేషంతో ప్రాణాలు బలిగొన్న సంఘటనలు లేవు. ఈ పరిస్థితికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలే కారణమనేది నిర్వవాదాంశం. ఎన్నికల ప్రచారం నాటి నుంచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తర్వాత కూడా అమెరికా ఫస్ట్‌, వలసలు అరికడతా, మన ఉద్యోగాలు మనకే... అని ద్వేషాన్ని రెచ్చగొట్టే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు. అదే భారతీయుల పాలిట శాపంగా మారుతోంది.


భారతీయులే విద్యాధికులు 
అమెరికా అత్యధికంగా వెళ్లేవారిలో చైనీయుల సంఖ్య అధికంకాగా, ఆ తర్వాత స్థానం మనదే. ఇంకా కొరియా, జపాన్‌, వియత్నాం, పాకిస్థాన్‌, నేపాల్‌ తదితర దేశాల నుంచి వెళ్లేవారూ ఉంటున్నారు. కానీ చదువు విషయానికి వచ్చేసరికి భారతీయ అమెరికన్లదే పైచేయి. 2013 గణాంకాల ప్రకారం అమెరికాలోని భారతీయుల్లో 76 శాతంమంది బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ కలిగి ఉన్నారు. ఇతర దేశాల సగటు చూస్తే 28 శాతం మాత్రమే.


సిలికాన్‌ వ్యాలీలో...

* ఐటీ పరిశ్రమకు కేంద్ర స్థానమైన సిలికాన్‌వ్యాలీలో భారతీయ నిపుణులు అడుగుపెట్టటం 1970-80 మధ్య కాలంలోనే ప్రారంభమైంది. వై2కే (2000 సంవత్సరం) నాటికి ఇది గరిష్ఠ స్ధాయికి చేరింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఐటీ సంస్థల్లో 15.5 శాతం భారతీయులు ప్రారంభించినవే. చైనా, బ్రిటన్‌, తైవాన్‌, జపాన్‌ దేశస్థులు భారత్‌ తరువాత స్థానంలో ఉన్నారు.

* సిలికాన్‌ వ్యాలీలోని ప్రముఖ సంస్థలను స్థాపించడంతో పాటు.. సీఈవోలు, వైస్‌ ప్రెసిడెంట్‌లు వంటి ఉన్నత స్థానాల్లో పలువురు భారతీయులు ఉన్నారు.

* హాట్‌మెయిల్‌ సృష్టికర్త సబీర్‌ భాటియా భారతీయుడే. 

* సన్‌ మైక్రోసిస్టమ్స్‌ సహవ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా నుంచి నేటి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వరకూ సిలికాన్‌ వ్యాలీలో భారతీయులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

* పెంటియమ్‌ చిప్‌ల సృష్టికర్త వినోద్‌ ధామ్‌ కూడా భారతీయుడే.

సంపాదనపరులూ మనోళ్లే... 

ఎక్కువ గంటలు పనిచేస్తారు.. ఇంటిదగ్గర నుంచి పనిచేయమన్నా చేస్తారు. శనివారం, ఆదివారం, సెలవు రోజైనా పనికి సిద్ధమే. అదే సమయంలో ఖర్చులు తక్కువ, పొదుపు ఎక్కువ. విదేశాల నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన వారిలో అధికాదాయం కలవారు భారతీయులే. సగటు అమెరికన్‌ సంపాదన ఏడాదికి 53,000 డాలర్లు ఉంటే, విదేశాల నుంచి వచ్చిన వారి సగటు ఆదాయం 48,000 డాలర్లు ఉంటుంది. అదే భారతీయుల సంపాదన మాత్రం ఏడాదికి ఒక లక్ష డాలర్లకు పైగానే ఉండటం గమనార్హం. విదేశాల నుంచి అమెరికా వలస వచ్చిన వారిలో పేదల సంఖ్య అతి తక్కువగా ఉన్నది కూడా భారతీయుల్లోనే.


రాజకీయ క్షేత్రంలో... 

కేవలం ఉద్యోగాలు, వ్యాపారానికే పరిమితం కాకుండా భారతీయులు అక్కడి సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వంలో కీలకమైన స్ధానాల్లో పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ సభ్యుడిగా, లూసియానా గవర్నర్‌గా వ్యవహరించిన బాబీ జిందాల్‌ ఇటీవల అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్‌ పార్టీ నామినేషన్‌ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అమీ బేరా, ఉపేంద్ర చివుకుల, స్వాతి దండేకర్‌, రాజా కృష్ణమూర్తి, కమలా హారిస్‌, ప్రమీలా జయ్‌పాల్‌... ఇలా చూస్తే అతిపెద్ద జాబితాయే ఉంది.

* 1948 నుంచి 2016 మధ్య అమెరికాలో విదేశీ విద్యార్థులు 41 రెట్లు పెరిగారు. 

* అమెరికాలో మొత్తం విద్యార్థుల్లో విదేశీయులు.
* అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీ విద్యార్థుల వల్ల సమకూరుతున్న మొత్తం: 3,500 కోట్ల డాలర్లు

* 2015-16లో విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమకూరింది: 2 లక్షల కోట్ల డాలర్లు 

* అక్కడకు విదేశాల నుంచి వచ్చినవారిలో భారతీయులే అత్యధికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ పన్ను రూపంలో భారీగా ఆదాయం అందిస్తున్నారు. 

* భారతీయులు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ప్రధానమైనవి: రవాణా, వసతి, వినోదం, ఆతిథ్య, ఆహార రంగాలు. 

* అనేక వృత్తులను విదేశీయులే చేపట్టడం వల్ల మానసిక, శారీరక ఒత్తిళ్లు తగ్గి అమెరికా ప్రజల ఆయుఃప్రమాణాలు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

1948: 1.1 శాతం 
2016: 5.2 శాతం 

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top