తెలుగుతెరపై తిరుగులేని విజయాలు అందించిన హీరో మహేశ్‌బాబు అయితే, ఎంటర్‌టైనింగ్ సినిమాలతో అందరినీ ఆకట్టుకొని పైసా వసూల్ సినిమాలకు చిరునామాగా మారిన దర్శకుడు శ్రీను వైట్ల. వారిద్దరి కాంబినేషన్‌కు సహజంగానే క్రేజ్. సినిమాల పరంగానే కాదు... వ్యక్తిగతంగా కూడా వారిద్దరూ అత్యంత సన్నిహితులు. ఇవాళ హీరో మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్లలో ఒకటైన ‘దూకుడు’ దర్శకుడు శ్రీను వైట్లను ‘సాక్షి’ పలకరించింది. ప్రస్తుతం మహేశ్‌బాబును పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ‘ఆగడు’లో చూపేందుకు సిద్ధమవుతూ, ఆ చిత్ర షూటింగ్‌లో యమ బిజీగా ఉన్న శ్రీను ఈ తరం సూపర్‌స్టార్ గురించి పంచుకున్న ముచ్చట్లు... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం.
మహేశ్‌బాబు నటనను నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నా, అతనితో వ్యక్తిగతంగా నాకు పరిచయమైంది మాత్రం 2010లో ‘దూకుడు’ తీస్తున్నప్పుడే! అంతకు ముందు కొన్ని సందర్భాల్లో కలిసినా, మా మధ్య పరిచయం ఏర్పడింది ఆ సినిమా కథ చెబుతున్నప్పుడు. ఆ కథను తెరకెక్కించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మా పరిచయం అలా అలా రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. నా లక్షణాలు ఆయనకూ, ఆయన లక్షణాలూ నాకూ బాగా నచ్చడంతో మా ప్రయాణం ఎంతో స్నేహపూర్వకంగా సాగుతోంది. ఇప్పుడు ‘ఆగడు’ చేస్తున్నప్పుడు కూడా నా మీద అతను పెట్టుకొన్న నమ్మకం నేను మర్చిపోలేను. గడచిన నాలుగేళ్ళుగా, అతనితో నాది అద్భుతమైన జర్నీ.
నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘దూకుడు’. అలాగే, మహేశ్ కెరీర్‌లో కూడా అది ఓ పెద్ద హిట్. మహేశ్‌లో నాకు నచ్చే అద్భుతమైన గుణం ఏమిటంటే, అతను ఏ రోజుకు ఆ రోజు మనిషిగా, నటుడిగా ఎదుగుతూనే ఉంటాడు. తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉంటాడు నేను ‘దూకుడు’ చేసిన రోజులతో పోలిస్తే ఇప్పుడు ‘ఆగడు’ చేస్తున్న నాటికి ఈ నాలుగేళ్ళలో అతను నటుడిగా మరింత పదునెక్కాడు. ఒక వ్యక్తిగా కూడా అతను సూపర్బ్ హ్యూమన్ బీయింగ్. అతను పిల్లలతో గడిపే తీరు ముచ్చటేస్తుంది. పైగా, చాలా మంది నటీనటులు మూడ్‌ను బట్టి సెట్‌లో వ్యవహరిస్తుంటారు, నటిస్తుంటారు. కానీ, నేను చేసిన ఈ రెండు చిత్రాల సమయంలో మహేశ్ తనకు మూడ్ బాగోలేదని అనడం నేనెప్పుడూ వినలేదు, చూడలేదు. సెట్స్ మీద ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉంటాడు. అది ఒక అద్భుతమైన వరం. నన్నడిగితే, అందుకే అతను అంత అందంగా కనిపిస్తాడు. అందమంతా ఆ నవ్వులోనే ఉంది. అసలే అందగాడు. దానికి ఈ నవ్వు తోడై, మరింత అందంగా కనిపిస్తుంటాడు.
గమ్మత్తేమిటంటే, కామెడీని కూడా మహేశ్ అద్భుతంగా పలికించగలడు. ‘దూకుడు’లో అతను చాలా చక్కటి కామెడీ పలికించాడు. అయితే,‘దూకుడు’లో మహేశ్‌ను నేను కొంత వరకే చూపించగలిగాననుకుంటా. రాబోయే ‘ఆగడు’లో అతను పూర్తిగా ఓపెన్ అప్ అవడం చూస్తారు. ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌లో, అటు యాక్షన్ పార్ట్‌లో, ఒకటని కాదు - అన్నిట్లో అతని విశ్వరూపం చూస్తారు. మహేశ్ అభినయం మరింత బాగుండనుంది.
మహేశ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నటుడిగా అతను ‘డెరైక్టర్స్ డిలైట్’ అని చెప్పాలి. అలాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా పండగే! నటుడిగా దర్శకుడికి పూర్తిగా లొంగిపోతాడు. డెరైక్టర్‌ను ఎంతో గౌరవంగా చూస్తాడు. పాత్రకు తగినట్లు ఏది కావాలో అది ఇస్తాడు. చిన్న డెరైక్టరా, పెద్ద డెరైక్టరా అని చూడడు. అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తాడు. అందరినీ ఒకేలా సంబోధిస్తాడు. ఆఖరుకు తను అవకాశమిచ్చిన దర్శకుడినైనా సరే ‘సార్... సార్’ అనే పిలుస్తాడు. అలాంటి అరుదైన మనస్తత్త్వం ఉన్న హీరో అతను. దర్శకుడిగా కాక, ఒక ప్రేక్షకుడిగా చెప్పాలంటే, మహేశ్‌లో ఎమోషన్ అద్భుతంగా పలుకుతుంది. యాక్షన్ సీన్లు బాగా చేస్తాడు. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అతను ఒక సమగ్రమైన నటుడు.
దర్శకుడిగానే కాక, వ్యక్తిగతంగా కూడా నేనివాళ మహేశ్‌కూ, అతని కుటుంబానికి ఎంతో సన్నిహితుణ్ణి కావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. మా ఇద్దరి మధ్య ఇంత స్నేహం, సాన్నిహిత్యం రావడానికి కారణం - మా ఇద్దరికీ ఉన్న నిర్మొహమాటం. ఏదైనా సరే అతను చాలా ఓపెన్‌గా మాట్లాడతాడు. నేను కూడా అంతే. ఏదన్నా అనిపిస్తే చెప్పేస్తాను. దాచను. ఆ లక్షణమే మా ఇద్దరినీ దగ్గర చేసిందని అనుకుంటాను. అలాగే, మా ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం - సెన్సాఫ్ హ్యూమర్. నేను బాగా నవ్వుతాను, నవ్విస్తాను. అది నాకు బాగా ఇష్టం. అతను కూడా అద్భుతంగా నవ్విస్తాడు. నేను తెర మీద నవ్విస్తుంటే, అతను బయట కూడా నవ్విస్తాడు. ఎలాంటి సందర్భంలోనైనా సరే అతను నవ్వు ముఖంతోనే ఉంటాడు. సెట్‌లో మహేశ్ ఉంటే చాలు.. ఆ ఉత్సాహమే వేరు. సెట్‌లో అతను లేని వర్క్ ఏదైనా జరుగుతూ ఉంటే, ‘అరే... మహేశ్ ఉంటే బాగుండేదే’ అనిపిస్తుంటుంది.
మహేశ్ మంచి చదువరి. పుస్తకాలు బాగా చదువుతుంటాడు. ప్రస్తుతం ‘ఆగడు’ చిత్రీకరణ దాదాపు చివరకు వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు తీరిక లేకుండా పతాక సన్నివేశాలు చేస్తున్నాం. దీని తరువాత విదేశాల్లో మరో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ఈ నెలాఖరులో పాటలు విడుదల చేస్తాం. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్. చివరిగా ఒక్క మాట! నేను మహేశ్‌బాబును ఎలా చూడాలనుకుంటున్నానో, అలా ‘ఆగడు’లో చూపించాను. సెప్టెంబర్‌లో సినిమా చూశాక, ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారు.