భార్యను అమ్మే తాగుడు...
పిల్లల గొంతు కోసే తాగుడు...
అక్రమం కోరే తాగుడు...
హింసించే తాగుడు...
నేరం పొర్లించే తాగుడు...
లవ్ ఫెయిలైతే తాగుడు...
లవ్ కిక్కిస్తే తాగుడు...
ఫ్యాషన్‌కి తాగుడు...
నాశనానికి తాగుడు...
థూ... పాడు జీవితం.
ఫుల్ బాటిల్ తాగుతున్నారు...
జీవితాల్ని ఖాళీ చేస్తున్నారు.
పన్నులు చిలికి తెచ్చిన
అమృతం ఇది.
సమాజం కక్కుకుంటున్న విషం ఇది...
దేవదాసు చేసిన ద్రోహం...
ప్రేమలో విఫలమైతే మద్యం సేవించాలి అని భారతీయులకు దేవదాసు నేర్పించాడు. సాహిత్యపరంగా ‘దేవదాసు’ నవల (రచన: శరత్) ఎంతో గొప్పదే అయినా రజనీకాంత్ సిగరెట్ స్మోకింగ్ యువత మీద ప్రభావం చూపించినట్టుగా అది భగ్నప్రేమికులందరి మీద ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. లవ్ అన్నాక ఫెయిల్యూర్లే ఎక్కువ ఉంటాయి. అలాంటి వారందరూ తాగి ఆ వైఫల్యానికి కారణమైన ఆడపిల్లల మీద హింసకు పాల్పడుతున్న ఉదంతాలు ఎన్నో. ప్రేమలో విఫలమైన ఆడవారు తాగనప్పుడు మగవారు మాత్రం ఎందుకు తాగాలి? దానికి బదులు మంచిగా పాలు తాగి, చక్కగా తయారయ్యి, నచ్చినవారితో తాజా ప్రేమలో పడవచ్చు కదా? మద్యం గ్లాసు కడుక్కోవడం కన్నా పాలగ్లాసును కడుక్కోవడంలోనే ఎక్కువ మర్యాద, సుఖం, మేలు ఉన్నాయి.
రాత్రికి మొగుడు ఇల్లు చేరతాడన్న గ్యారంటీ లేదు. కొడుకు తూలకుండా వస్తాడన్న గ్యారంటీ లేదు. కాలేజీకెళ్లిన పిల్లవాడు తన బైక్‌ను ఏ మత్తులో ఏ డివైడర్‌ను గుద్దుతాడోనని భయం. ఉద్యోగం సరిగ్గా నడవదు. జీతం సగం కూడా ఇంటికి రాదు. అర్ధరాత్రి పళ్లేలు విసిరికొట్టిన చప్పుడు. ఇంటి ఇల్లాలిపై తల్లిపై పిడిగుద్దుల వర్షం. తాగి... మళ్లీ మళ్లీ తాగి... మరి తాగలేక కక్కుడు. ఎవరితోనో కొట్లాట... వేరెవరి మీదకో కత్తి దూయడం... అదుపు తప్పి యాక్సిడెంట్... లేదా కల్తీ మద్యానికి ప్రాణం విడవడం...
ఇదీ వర్తమాన భారతదేశం.
దీనిని పుణ్యభూమి అంటాము. కర్మ భూమి అంటాము. పవిత్ర మతాలు పుట్టిన భూమి అంటాము. కాని సంస్కృతిలో సురాపానం ఉంది. దానికి ముందు సోమపానం ఉంది. అయితే ఈ అలవాటును ధర్మాలన్నీ కట్టడి చేసే ప్రయత్నం చేశాయి. హిందూ ధర్మం మద్యపానాన్ని దుర్లక్షణంగా పేర్కొంది. బౌద్ధం దీనిని పూర్తిగా వ్యతిరేకించింది. ఇక్కడ ప్రవేశించిన ఇస్లాం దీనిపై నిషేధమే ప్రకటించింది. రాచరికం అంతమయ్యి బ్రిటిష్ పాలన మొదలై సాగిన దాదాపు 200 ఏళ్లు దేశంలో మద్యం విజృంభించింది. ప్రభుత్వ రాబడికి అది ముఖ్య ఇంధనంగా మారింది. తెల్లపాలన అంతమయ్యి నల్లపాలన వచ్చాక ఆ రాబడిపై దృష్టి ఇంకా పెరిగింది. ఎన్ని విధాలుగా మద్యాన్ని ప్రజలకు చేరువ చేయవచ్చో ప్రభుత్వాలు పోటీ పడి పథకాలు కనిపెట్టాయి.
ఒక చేత్తో ఇచ్చి వంద చేతులతో తీసుకునే ఈ ఆటలో ప్రజలు బలి పశువులు అవుతున్నారు. కష్ట జీవి పనిలో కండను, పని అనంతరం తాగుడు వ్యసనంలో గుండెను పోగొట్టుకుంటున్నాడు. సుష్టుగా పదే పదే తింటే మన ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదం. కాని మద్యం అలవాటున్న వ్యక్తి ఒక సమాజపు ఆరోగ్యానికి ప్రమాదం. మద్యం మనసుపై ప్రభావం చూపుతుంది. మెదడును అదుపులేని గుర్రంలా పరుగు పెట్టిస్తుంది. ఆ వ్యసనం ఎన్ని జీవితాలను ఎలా కుప్పకూలుస్తున్నదో కొన్ని ఉదాహరణలు...
ఘటన 1
నిలువునా కాల్చేశాడు!
విశాఖపట్నానికి చెందిన రాజేశ్ చాలా నెమ్మదస్తుడు. తన పనేంటో తనదే. ఎవరైనా పలకరిస్తే పలుకుతాడు. నవ్వితే నవ్వుతాడు. అంతకుమించి తన గురించి మాట్లాడుకోడానికి ఏం లేదు. కానీ కొద్ది రోజుల్లోనే అందరూ అతని గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అలా అని అతనేం గొప్ప పని చేయలేదు. ఊహించని విజయం సాధించనూ లేదు. మందు కొట్టడం మొదలెట్టాడు. అవును. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఎప్పుడంటే అప్పుడే. ఎక్కడంటే అక్కడే. ఎంతంటే అంతే. తాగడం, ఇంటికొచ్చి వాగడం. మత్తులో భార్యను సాధించేవాడు. అనుమానించి వేధించేవాడు. కొట్టి హింసించేవాడు. ఆమె ఆ నరకాన్ని భరించలేక పెద్దలకు చెప్పింది. వాళ్లు అతణ్ని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ చాలా మారాడు. తిరిగి సంతోషంగా ఇంటికి చేరాడు. కానీ కథ మళ్లీ వెనక్కి నడిచింది. రాజేశ్ నాలుక మందు చుక్కల కోసం పీకడం మొదలు పెట్టింది. సారాబుడ్డీ అతణ్ని సాదరంగా ఆహ్వానించింది. అతడి జీవితం మరోసారి సారా దుకాణం పాలయ్యింది. ఒక్కసారి మానేసి మళ్లీ తాగడం మొదలెడితే మనిషి దారుణంగా తయారవుతాడట. అందుకేనేమో ఒకప్పుడు భార్యను వేధింపులకు గురిచేసిన రాజేశ్, ఈసారి మత్తులో ఏకంగా ఆమెను కిరోసిన్ పోసి చంపేశాడు. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు.
ఘటన 2
ఇప్పుడే వస్తానని చెప్పి...
ఢిల్లీలోని ఓ రెస్టారెంట్. ఇద్దరు దంపతులు అప్పుడే భోజనం చేశారు. ఇంటికి వెళ్లడానికి బయటికొచ్చి కారు ఎక్కారు. ‘కరణ్‌కి ఫోన్ చేస్తాను, వస్తానంటే పికప్ చేసుకుని వెళ్లిపోదాం’ అందామె. సరే అన్నట్టు తలూపాడు భర్త. ఆమె ఫోన్ చేతిలోకి తీసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసి, ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటోన్న కొడుక్కి ఫోన్ చేసింది. ‘నా ఫ్రెండ్ కారుందమ్మా, ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాం, నేను వచ్చేస్తాలే, మీరు వెళ్లండి’ అన్నాడు కరణ్. సరేనని వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఎంతసేపైనా కరణ్ ఇంటికి రాలేదు. దాంతో తల్లి ఆదుర్దాగా కొడుక్కి ఫోన్ చేసింది. ఫోన్ ఓ అపరిచిత వ్యక్తి తీశాడు. అతను చెప్పిన వార్త విని ఆ తల్లి గుండె ఆగినంత పనయ్యింది. భర్తను తీసుకుని పరుగు పరుగున బయల్దేరింది. నడిరోడ్డు మీద... నుజ్జునుజ్జయిన కారుకింద... గుర్తు పట్టలేని స్థితిలో పడివుంది కరణ్ మృతదేహం. పక్కనే మరో ఇద్దరు అబ్బాయిల దేహాలు. ఇప్పుడే వస్తానని చెప్పిన కరణ్‌కి అంతలోనే ఏమైంది? ఆరా తీస్తే.. నిజం తెలిసింది. పార్టీలో బాగా తాగేసిన ఓ కుర్రాడు వాళ్ల కారు నడిపాడు. యాక్సిడెంట్ చేశాడు. అతనికేం కాలేదు. కానీ మిగతా ముగ్గురూ మరణించారు. ఆ ముగ్గురూ ఒక్క చుక్క మద్యం సేవించలేదని అటాప్సీ రిపోర్ట్ చెప్పింది. తమ స్నేహితుడి వ్యసనానికి వాళ్లు బలైపోయారన్న నిజం అందరి గుండెల్నీ మెలిపెట్టింది.
ఘటన 3
మత్తు పొరలు కమ్మి...
హైదరాబాద్‌లోని బొలారం ప్రాంతం. రంగుల కార్మికుడు రామకృష్ణ, భార్య బబిత కంగారుగా ఊరంతా కలియదిరుగుతున్నారు. వాళ్ల కూతురు సరిత (10) కనిపించడం లేదు. అందరినీ అడుగుతున్నారు. అందరూ తమకు తెలియదనే చెబుతున్నారు. వెతికి వెతికి చివరికి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించారు. కంప్లయింట్ ఇవ్వడంతోనే పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. చివరికి ఓ అటవీ ప్రాంతంలో చిన్నారి సరిత విగతజీవిగా కనిపించింది. లోకం తెలియని పాపపై దారుణంగా అత్యాచారం చేసి, బండతో తలపై మోది చంపేశారు. ఆ చిట్టితల్లిని అలా చూసి అందరి మనసులూ వికలమయ్యాయి. కానీ ఆ పాప మరణానికి కారణం తెలిశాక అవే మనసులు కోపంతో రగిలిపోయాయి. పాపను తీసుకుని తల్లిదండ్రులిద్దరూ మధ్యాహ్నం కల్లు తాగడానికి వెళ్లారు. అక్కడ వాళ్లకి మరో తాగుబోతు అనిల్ పరిచయమయ్యాడు. పాపకి చాక్లెట్ కొనిస్తాను అనంటే అతనితో పాపను పంపేశారు. అతగాడు తాగిన మత్తులో ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారిని చిదిమేసిన పాపం ఎవరిది? కన్నూ మిన్నూ గానని అనిల్‌దా... మత్తులో మునిగిపోయి ముక్కూ ముఖం తెలియనివాడితో పాపను పంపిన తల్లిదండ్రులదా... బాధ్యతల్ని, మానవత్వాన్ని మర్చిపోయేలా చేసిన మద్యానిదా???
ఘటన 4
మనిషినని మర్చిపోయి...
భోరున ఏడుస్తున్నాడు పాండు. అతని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఏదైనా కష్టం ఉంటే తనతో ఒక్కమాట చెప్పవచ్చు కదా, అంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం ఎందుకు అని పదే పదే తనలో తాను తర్కించుకుంటూ కుమిలిపోతున్నాడు. అతని పరిస్థితి చూసి పోలీసులు ఏమీ ప్రశ్నించలేకపోతున్నారు. కానీ తప్పదు కదా? విచారణ చేయాలి. అందుకే మెల్లగా తమ పని మొదలు పెట్టారు. ఎంత అడిగినా తన భార్య ఆత్మహత్యకు కారణం తెలియదని, తను ఎలా చనిపోయిందో అర్థం కావట్లేదని అంటున్నాడు పాండు. కానీ ఎందుకో పోలీసులకు అతని మీదే అనుమానం కలుగుతోంది. దాంతో రకరకాల ప్రయత్నాలు చేశారు నిజం చెప్పించడానికి. చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి. పాండు నోటివెంట నిజం బైటికొచ్చింది. తాగిన మత్తులో భార్యతో గొడవపడి, ఆమెను చంపేసి ఉరితాడుకు వేళ్లాడదీశాడు పాండు. అయితే ఆ నిజాన్ని అతడు దాచిపెట్టలేదు. పెట్టాలనీ అనుకోలేదు. మర్చిపోయాడు... అంతే. అవును. నిజంగానే మర్చిపోయాడు. అతను ఎంతగా తాగాడంటే... తాగిన మత్తులో తాను చేసిన నేరం అతనికి ఏమాత్రం గుర్తు రాలేదు. చెన్నైలో జరిగిన ఈ సంఘటన... ఆల్కహాల్ మనిషిని మనిషిలో లేకుండా ఎలా చేసేస్తుందో తెలిసేలా చేసింది.
పేదవాడి పొట్ట కొడుతోంది...
వైన్‌షాప్‌కు పేదవాడే మహారాజ పోషకుడు. దుర్భర దారిద్య్రం, జీవితంలోని కష్టాలు... వీటిని దూరం చేయడంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాలకులు ఆ పేదలకు చీప్ లిక్కర్‌ని చేరువ చేస్తారు. అవి తాగి కష్టాలు మర్చిపో అంటారు. మా జోలికి రావద్దంటారు. విప్లవం లేవదీయవద్దంటారు. తన కష్టానికి కారణం కనుక్కోలేని, వ్యవస్థలో దోపిడిని అర్థం చేసుకోలేని పేదవాడు మద్యానికి బానిస అవుతాడు. జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. పేదవాడి నెత్తురే ఇవాళ పాలకుల ఖజానాకు కాసు అందిస్తోంది. తన రోజువారి సంపాదనలో అరవై శాతాన్ని పేదలు మద్యానికి పెడుతున్నారు. ఈ విషవలయం అభేద్యమైనది. మద్యనిషేదం లేదా మద్యంపై కంట్రోల్ దీనికి ఒక ప్రధానమైన విరుగుడు.
అమర్యాద కాస్తా మర్యాద అయ్యింది...
ఇరవై ఏళ్ల క్రితం వరకు ఎవరైనా తాగితే తాగుబోతు అనేవారు. తాగినవారికి అపరాధభావం ఉండేది. తాగిన కుటుంబ పెద్దతో పాటు అతని కుటుంబం కూడా ఆ పెద్దకు ఆ అలవాటు ఉన్నందుకు సిగ్గుపడేది. తాగుబోతులను సంఘం దూరం పెట్టేది. నలుగురిలో మర్యాద ఇవ్వకుండా శిక్షించేది. కాని ఇవాళ మధ్యతరగతి మద్యాన్ని దాదాపుగా అంగీకరించే పరిస్థితికి చేరుకుంది. భర్త తాగి వస్తే గుండెలు బాదుకోవాల్సిన భార్యలు ఆ ఏడుపేదో ఇంట్లోనే ఏడవొచ్చు కదా అనుకునే నిస్సహాయ పరిస్థితికి నెట్టివేయబడ్డారు. భర్తలు బయట తాగి ఏ ప్రమాదంలో పడతారో అని ఆ పనిని ఇంట్లోనే అంగీకరిస్తున్నారు. గతంలో నలుగురూ కూడటానికి సాయంత్ర వేళలు అవసరమయ్యేవి. టీలు, కాఫీలు వాటిలో పానీయాలుగా ఉండేవి. కాని ఇప్పుడు నలుగురు కూడాలంటే మద్యం అవసరమవుతోంది. ‘పార్టీ’ ఉంటే తప్ప నలుగురూ ఒకరిని మరొకరు కలవడానికి రావడం లేదు. పైగా ఎవరైనా తాగము అనంటే అలాంటి వారిని స్కిప్ చేసి మిగిలినవాళ్లు పార్టీకి కూర్చుంటూ ఉండటంతో తాగనివారు కూడా తాగాల్సి వస్తోంది. ఇక కెరీర్‌లో క్లయింట్‌లతో మీటింగ్, కస్టమర్లతో మీటింగ్, పై అధికారులతో పిచ్చాపాటి... వీటన్నింటిలో మద్యం లేకపోతే మనిషి ముందుకు కదల్లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ మిడిల్‌క్లాస్ ఫ్లాట్లలో ఉండే కప్‌బోర్డులలో మద్యం సీసాను కూడా ఉంచి పెట్టే ఆనవాయితీ వచ్చేసిందంటే తాగుడు ఎంతగా చొచ్చుకుని వస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ సంఘం క్రైమ్ చేసినవారిని దూరం పెడుతోంది. మద్యం సేవించడం కూడా సాంఘిక నేరం అని గట్టిగా భావించగలగాలి. అలాంటివారిని సంఘమే నిరోధించాలి. మద్యం క్రైమ్‌కు పరోక్ష కారణం. ఆ కారణాన్ని చిదిమేయాల్సిందే.
మద్యం మత్తు... సినీ జీవితం చిత్తు...
►తెలుగు నటీమణి సావిత్రి మద్యం ప్రభావానికి లోనవడం వల్లే ఆరోగ్యం దెబ్బ తినడం, చిన్న వయసులోనే మృతి చెందడం జరిగిందనే అభిప్రాయం ఉంది.
►సినీ నటుడు హరనాథ్ మద్యానికి బానిస కావడం వల్లే హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయారనేది వాస్తవం.
►హిందీ రంగంలో నటి మీనాకుమారి, దర్శకుడు గురుదత్, నటి రాఖీ మద్యానికి బానిసలయ్యారు. అది వారి ప్రాణాలు తీసే దాకా ఊరుకోలేదు.
►నటుడు సల్మాన్ ఖాన్ 2002 హిట్ అండ్ రన్ కేసులో మద్యం సేవించాడన్న ఆరోపణలు ఉన్నాయి.
►నటుడు ధర్మేంద్ర మద్యానికి ఎక్కువ ఆకర్షితుడు కావడం వల్ల కెరీర్‌ను చాలా నష్టపోయినట్టుగా స్వయంగా ఒప్పుకున్నాడు.
►నటి మనీషా కోయిరాలా మద్యానికి బానిస కావడం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. కేన్సర్ చికిత్స తర్వాత ఆమె ఆ దురలవాటును మాని ఉంటుందనే అందరి ఆశ.
మద్యపానం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
భారతదేశంలో మద్యపానం అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది? కేరళ.... ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? దీనికి ఎవరి లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. మీడియాలో అత్యధిక శాతం మాత్రం కేరళకే ఆ అపకీర్తి కిరీటం పెట్టారు.ఇలాంటి డేటాలన్నిటికీ మూలమైన భారతదేశంలోని ‘జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్’ (ఎన్.ఎస్.ఎస్.ఒ) లెక్కలు కాస్తంత వేరుగానే ఉన్నాయి. అధిక ఆదాయ వర్గానికి చెందినవారిలో మద్యపానం అలవాటు గురించి డేటా సేకరించకపోవడం లాంటి లోటుపాట్లెన్నో ఈ లెక్కల్లో ఉన్నాయి. అయితే, ఉన్నంతలో భౌగోళిక, ఆర్థిక అంశాలకు ప్రాతినిథ్యమిస్తూ రూపొందిన విస్తృత డేటా ఇదే.
ఈ డేటా ప్రకారం కల్లు, దేశవాళీ మద్యం దాద్రా అండ్ నగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ - నికోబార్ దీవుల్లో అత్యధికంగా తాగుతారు. ఇక పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అన్నిటికన్నా ముందుంది. ఆ తరువాత స్థానాలు అస్సామ్, జార్ఖండ్, బీహార్‌లవి.బీరు, వైన్, విదేశీ మద్యం విషయంలో డామన్ అండ్ డయ్యూ, అండమాన్ - నికోబార్ దీవులు, దాద్రా - నగర్ హవేలీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరీ ప్రథమస్థానంలో నిలిచాయి. ఆ తరువాతి స్థానాన్ని గోవా, ఆంధ్రప్రదేశ్‌లు ఆక్రమించాయి. ఇక, మూడో స్థానంలో కేరళ, కర్ణాటక ఉన్నాయి.
మద్యం... మతి పోగొడుతుంది!
డాక్టర్ మాట
మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎం.ఎల్.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం, కాస్త దుడుకుతనం కలుగుతాయి. ఆ హుషారును కొనసాగించడానికి మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే మద్యం కాస్తా 80 ఎం.ఎల్. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. తమపై తాము నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఏకాగ్రత లేకపోవడం వంటి మార్పులకు కారణమవుతుంది. ఆ తర్వాత ఆ పరిమాణం 200 ఎం.ఎల్.కు చేరితే కోపం, చిరాకు, దెబ్బలాటకు దిగడం, అరవడం వంటి దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయి. దెబ్బలాటలు ముదిరినప్పుడు నేరాలకూ దారితీస్తాయి. దాదాపు 90 శాతం నేరాలు, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలకు మద్యమే కారణమవుతోంది. ఇక మద్యం ఒక వ్యసనంగా మారినప్పుడు ఒక వ్యక్తి ప్రమేయం లేకుండానే తాగడం మొదలుపెడతాడు. ఓ మోతాదు దగ్గర తనను తాను నియంత్రించుకోలేడు. అందుకే మద్యం తాగడాన్ని వ్యాధిగానే డాక్టర్లు (మానసిక నిపుణులు) పరిగణిస్తారు. మద్యం లైంగిక హింస, గృహహింస, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అగాధాన్ని పెంచుతుంది. నేరప్రవృత్తిని అధికం చేస్తుంది. నేరమనస్తత్వం (యాంటీసోషల్ పర్సనాలిటీ) ఉన్నవారిలో ఇతరుల బాధల పట్ల స్పందించే గుణం ఉండదు. అందుకే తాగినవారు నేరాల సమయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటారు.
యౌవన దశలోనే అలవాటు ఎందుకవుతుంది?
వయసు పెరుగుతున్న క్రమంలో మెదడు ఎదుగుదల కింది భాగం నుంచి పైకి జరుగుతుంటుంది. మెదడు కింది భాగాల్లో పరిణతి వచ్చాక పై భాగంలో ఉన్న నిర్మాణంలో ఎదుగుదలకు కొంత సమయం పడుతుంది. అయితే కింది భాగాలను నియంత్రించే పని పై భాగాలది. ఫలితంగా యౌవనదశలో మెదడులోని కింది భాగాలపై... పైన ఉండే భాగాల నియంత్రణ అంతగా ఉండదన్నమాట. అందుకే టీనేజ్‌నుంచి యుక్తవయసులోకి మారుతున్న వారిలో దుడుకు స్వభావం, నిగ్రహం లేకపోవడం, కొత్త విషయాలపై తీవ్రమైన ఆసక్తి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మనసు నియంత్రణ లేక మద్యం, పొగాకు వంటి దురలవాట్లు తేలిగ్గా దరిచేరుతాయి. బానిసగా మారుస్తాయి.
మద్యం అలవాటు... సెక్స్ ఆసక్తి...
మద్యపానం వల్ల సెక్స్ కోరికలు పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ తాగినప్పుడు లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. అది గమనించక చాలామంది మద్యం వల్ల పెరిగే కోరికనే సామర్థ్యంగా అపోహపడి, మరింతగా బానిస అవుతుంటారు. మద్యం అలవాటు బాగా పెరిగాక మెదడులో కొన్ని రసాయనిక మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పుల వల్ల కనిపించే పరిణామాలివి...
హేలూసినేషన్స్: లేని ఆకారాలు కనిపించడం, లేని శబ్దాలు వినిపించడం జరుగుతుంది.
అనుమానాలు: జీవిత భాగస్వామికి ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయనే నిరాధారమైన అనుమానాలు పెరుగుతుంటాయి.
డెలీరియమ్: ఒక్కోసారి తీవ్రమైన అయోమయం, చిత్రమైన, భయంకరమైన అనుభవాలకు గురవుతారు. చేతులు, తలపై పురుగులు పాకుతున్నట్లనిపిస్తుంది.
మద్యం అలవాటుకు చికిత్స ఇలా: మద్యం అలవాటుకు చేసే చికిత్సలో భాగంగా మొదట అది మానే సమయంలో కనిపించే లక్షణాలకు చికిత్స చేస్తారు. తర్వాత తాగుడు మాన్పించడం కోసం మందులు ఇస్తూ అదే సమయంలో సైకోథెరపీ, కౌన్సె లింగ్ చేస్తారు. సామాజిక నైపుణ్యాల శిక్షణ (సోషల్ స్కిల్స్ ట్రైనింగ్) కూడా ఇస్తారు. ఇందుకోసం మానసిక వైద్యుల పర్యవేక్షణ అవసరం. అందుకే మద్యం మానాలన్న తీవ్రమైన కాంక్షను పెంపొందించుకుని, మానసిక వైద్యులను కలుసుకోవాల్సి ఉంటుంది.
- డా॥శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్
సర్వేలు ఏం చెబుతున్నాయి?ప్రమాదకరంగా పెరుగుతోంది!
మన దేశంలో మద్యపానం ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. ఈ మాట సాక్షాత్తూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) చెప్పింది. ఆల్కహాల్‌కూ, ఆరోగ్యానికీ సంబంధించి ప్రపంచవ్యాప్త స్థితిగతుల నివేదికను డబ్ల్యు.హెచ్.ఒ ఆ మధ్య విడుదల చేసింది. అప్పుడే, ఈ సంగతి బయటపడింది.
పదిహేనేళ్ళు, ఆ పై వయస్సు గలవారిలో మద్యపానం అలవాటును గురించి వివరాలు సేకరిస్తే, 2008కీ, 2012కీ మధ్య కాలంలో మనదేశంలో మద్యపానం ఊహించనంతగా పెరిగిందని వెల్లడైంది.ఒక్క 2010 నాటి లెక్కలు చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ లెక్కల ప్రకారం మన దేశ జనాభాలో నూటికి 30 మంది మద్యపానం చేస్తున్నారు. వారిలో 4 నుంచి 13 శాతం మంది మద్యం ముట్టకుండా, రోజు గడవనివాళ్ళే!2003 - 05 మధ్య కాలంలో మన దేశం జాతీయ సగటు మద్యపానం 1.6 లీటర్లే! అయితే, 2010-12 మధ్యకల్లా అది 2.2 లీటర్లకు చేరింది. చిత్తుగా తాగేవాళ్ళ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 16 శాతం ఉంటే, మనదేశంలో నూటికి 11 మంది అలాంటి పచ్చి, పిచ్చి తాగుబోతులే!
మరణానికి దగ్గర దోవ
మద్యపానం వల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతుందన్నది జగమెరిగిన సత్యం. మద్యపానానికీ, దాని వల్ల కోల్పోయిన ఆయుష్షుకూ ముడిపెడుతూ ‘కోల్పోయిన సంవత్సరాల’ స్కేల్‌ను ఒకదాన్ని రూపొందించారు. 1 నుంచి 5 వరకు అంకెలుండే ఆ స్కేలులో మన దేశం 4గా రేట్ అయింది. అంటే, మన దేశంలో మద్యపాన ప్రియులు తాగుడు, దాని పర్యవసానాల వల్ల తమ జీవితంలో గణనీయమైన ఆయుష్షునే పొగొట్టుకుంటున్నారు.ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరణాలకూ, అంగవైకల్యాలకూ దారి తీస్తున్న అగ్రశ్రేణి కారణాల్లో 3వది మద్యపానమే! {పపంచవ్యాప్తంగా ఇవాళ ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్య - అతి మద్యపానమే! ప్రపంచంలో నూటికి ఆరుగురు మద్యపానం వల్లే మరణిస్తున్నారు. అనేక రకాల క్యాన్సర్లు, క్షయ, మూర్ఛ, రక్తనాళాలు చిట్లడం వల్ల పక్షవాతం, అధిక రక్తపోటుతో హృద్రోగం, లివర్ సిరోసిస్, న్యూరో సైకియాట్రిక్ లాంటి దాదాపు 60కి పైగా ప్రధాన వ్యాధులకు కారణం - మద్యపానమే.
పెరుగుదలలో మూడో ప్లేస్!
‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్’ (ఒ.ఇ.సి.డి) ఏడాది క్రితం విడుదల చేసిన నివేదిక కూడా మన దేశంలో జాతీయ సగటు మద్యపానం గత పాతికేళ్ళలో విపరీతంగా పెరిగినట్లు తేల్చింది. 1992 - 2012 మధ్యకాలంలో మన దేశంలో జాతీయ సగటు మద్యపానం 55 శాతం మేర పెరిగింది. ప్రపంచంలో ఇంత భారీగా మద్యపానం పెరిగిన దేశాల్లో ఇండియా ఏకంగా మూడోస్థానంలో నిలిచి, అపకీర్తిని మూటగట్టుకుంది. నిజానికి, ఇదే కాలవ్యవధిలో ‘ఒ.ఇ.సి.డి’లోని 34 సభ్యదేశాల్లో వార్షిక సగటు మద్యపానం 2.5 శాతం మేర తగ్గింది.
ఉత్పత్తి తగ్గుతోంది!
చిత్తుగా తాగడం అలవాటవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. ఉద్యోగం ఉన్నవాళ్ళు కూడా పనికి గైర్హాజరవుతున్నారు. ఫలితంగా ఉత్పాదకత తగ్గుతోంది. వెరసి, తాగుడు వల్ల ఉన్నత, మధ్యశ్రేణి ఆదాయ దేశాల్లో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) 1 శాతం మేర పడిపోతున్నట్లు లెక్క!
కొత్త బానిసలు...యువకులు, స్త్రీలు!
ఇవాళ అధికభాగం దేశాల్లో యువత, మహిళల్లో మద్యపానం విపరీతంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే, పిల్లలు చిన్నవయసులోనే మద్యం రుచి చూడడం ఎక్కువవుతోంది. గడచిన పదేళ్ళ కాలంలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలూ ఈ బాట పట్టారు.మనదేశంలో 1980లలో సగటున 28 ఏళ్ళ వయస్సు వస్తే కానీ, మద్యం రుచి చూసేవారు కాదు. కానీ, 2007 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నూనూగు మీసాల వయసులోనే... అంటే 17 ఏళ్ళకే పెగ్గు బిగించడం అలవాటైపోయింది. తల్లితండ్రులు, గురువులు, సమాజం కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం ఇది.
మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నూటికి దాదాపు 25 యాక్సిడెంట్లు మద్యం మత్తులో జరుగుతున్నవేనని సర్వేల్లో తేలింది. ఇలాంటి ప్రమాదాల్లో యువత ఎక్కువగా చనిపోతూ ఉండటం దురదృష్టకరం. అది మాత్రమే కాదు... మద్యపానం వల్ల గృహహింస కేసులు కూడా పెరిగిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.