fvz

Saturday, September 21, 2013

Andhra Pradesh Historical Events - The Historical Errors

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ సమస్య వచ్చి ఉండేది కాదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబు చాలా రోజుల తర్వాత ఈ వ్యాఖ్య చేశారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా శాసనసభలో పలుమార్లు ఈ అంశం ప్రస్తావిస్తుండేవారు.కెసిఆర్ నిజానికి చంద్రబాబు కు సన్నిహితంగా ఉండేవారు.1995 లో ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో చంద్రబాబుకు కెసిఆర్ చేదోడు,వాదోడుగా ఉండేవారు.కాని చంద్రబాబు తన తొలి క్యాబినెట్ లో వివిధ కారణాల వల్ల మంత్రి పదవి ఇవ్వలేదు.దాంతో కెసిఆర్ అబిమానులు రాజ్ భవన్ లోనే గొడవ చేశారు.ఆ తర్వాత సంవత్సరం కెసిఆర్ కు మంత్రి పదవి లభించింది.అనంతరం జన్మభూమి సిద్దాంత పత్ర రూపకల్పనలో , టిడిపి శిక్షణ తరగతుల నిర్వహణ వంటి వాటిలో కెసిఆర్ క్రియాశీలకంగా ఉండేవారు. 

కాని 1999 ఎన్నికల నాటికే చంద్రబాబుతో కెసిఆర్ కు సంబంధాలు కొంత దెబ్బతిన్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. దానికి తగ్గట్లుగానే సిబిఐ మాజీ డైరెక్టర్ కె.విజయరామారావుకు, మరో సీనియర్ నేత విద్యాధరరావుకు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు అదే సామాజికవర్గానికి చెందిన కెసిఆర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు.దానిపై కెసిఆర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.దాంతో చంద్రబాబు నాయుడు అప్పట్లో కెసిఆర్ కు ఉప సభాపతి పదవి ఇచ్చారు.నిజానికి మంత్రి పదవి చేసినవారు ఈ పదవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. సభాపతి పదవి ఇచ్చి ఉంటే ఎలా ఉండేదో.కాని ప్రతిభా భారతికి స్పీకర్ పదవి ఇచ్చి కెసిఆర్ కు ఉప సభాపతి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్న కెసిఆర్ క్రమేపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై దృష్టి సారించారు. అప్పటి వరకు జరిగిన ఉద్యమాలు, ఆయా నాయకులు చేసిన యత్నాలు మొదలైనవాటన్నటిపైన అవగాహన కలిగిన కెసిఆర్ తెలంగాణ వాదులుగా గుర్తింపు పొందిన వారితో సంప్రదింపులు చేసేవారు.

 ఆ దశలో చంద్రబాబు కు సమాచారం ఉన్నప్పట్టికీ అంత సీరియస్ గా తీసుకుని ఉండలేదు.కెసిఆర్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారని టిడిపి నేతలంతా చెప్పుకునేవారు.అయినా చంద్రబాబు ఇంత సీరియస్ అవుతుందని ఊహించక పోవడం వల్లనో, పార్టీ నడపడం అంత తేలిక కాదన్న భావనతోనో కెసిఆర్ ను ఆపలేదు. ఆ తర్వాత కెసిఆర్ పార్టీ పెట్టడం ,ఈ పదకుండేళ్లలో అనేక ఎత్తుపల్లాలను చూడడమే కాక, దాదాపు అన్ని పార్టీల నేతలను తనదారిలోకి తెచ్చుకోగలిగారు. వారిని కెసిఆర్ ట్రాప్ చేశారా?లేక ఇది జరిగేది కాదులే అన్న అబిప్రాయంతో లేఖలు ఇచ్చారా అన్నది వేరే విషయం. స్వయంగా ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసు అని వ్యాఖ్యానించినా, రెండువేల తొమ్మిది ఎన్నికలలో మహబూబ్ నగర్ లో చంద్రబాబు నాయుడు తెలంగాణ కు అనుకూలంగా తీర్మానం చేస్తామని చంద్రశేఖరరావుతో కలిసి ప్రసంగం చేసినా, అదంతా కెసిఆర్ ఖాతాలోకే జమ అయింది.రాష్ట్ర చరిత్రలోకాని, ఆ మాటకు వస్తే దేశ చరిత్రలో కూడా ఇన్ని మలుపులు తిరుగుతూ ఇన్నళ్లపాటు సాగిన ఉద్యమం అనండి, భావజాల వ్యాప్తి అనండి ,మరొకటి ఉండకపోవచ్చు.గతంలో అనేక రకాల ఉద్యమాలు వచ్చాయి. కాని అవి కొంత కాలానికే పరిమితం.ఉదాహరణకు ఎన్.టి.ఆర్.హయాంలో మండల్ ఉద్యమం వచ్చింది. ఓ ఆరేడు నెలలు నడిచింది.ఆగిపోయింది. దేశవ్యాప్తంగా రామమందిరం ఉద్యమం వచ్చింది. ఒకటి,రెండు సంవత్సరాల తర్వాత దాని ప్రాధాన్యత తగ్గిపోయింది.మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులను వెనుకబడిన తరగతుల లోకి చేర్చాలన్న ఉద్యమం నడిచింది.

అది కొద్ది నెలల తర్వాత ఆగిపోయింది.మంద కృష్ణ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ ఉద్యమం చేసింది.అది కూడా కొంత కాలానికే పరిమితం అయింది.అలాగే రైతు సమస్యలపై కానివ్వండి,వ్యాపార సమస్యలపై కాని వ్వండి , ఆయా ఉద్యమాలు వచ్చినా వాటి లక్ష్యం నెరవేరో, నెరవేరకపోయినా వివిద కారణాల వల్లే ఆగిపోతే, తెలంగాణ ఉద్యమం మాత్రం గత పన్నెండేళ్లుగా ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతూనే ఉంది.దానికి ప్రధాన కారణం నేతల చారిత్రక నిర్ణయాలే నని చెప్పాలి. అంతకుముందు 1999లో టిడిపి అదికారంలోకి వచ్చాక వై.ఎస్.రాజశేఖరరెడ్డి సిఎల్పీ నాయకుడిగా ఉండేవారు.అప్పట్లో చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణపై సోనియాగాంధీకి లేఖ ఇచ్చిన మాట వాస్తవం.రాజశేఖరరెడ్డి కూడా ఇది అయ్యేదా అని సీరియస్ గా తీసుకోలేదు.కాని ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండో ఎస్.ఆర్.సి నిర్ణయం తీసుకుని అంతటితో వదలివేసింది. కాని రెండువేల నాలుగులో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలన్న చారిత్రక నిర్ణయంతో తెలంగాణ అంశం అనేక మలుపులు తిరిగింది. ఆ తర్వాత ప్రణబ్ కమిటీ రావడం, టిఆర్ఎస్ కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రి పదవులు తీసుకోవడం వంటివి జరిగాయి. 

ఆ తర్వాత 2008 లో టిడిపి ఏకంగా తెలంగాణ కు అనుకూలంగా నిర్ణయం చేయడం మరో చారిత్రక మలుపు.అప్పటివరకు సమైక్యవాద పార్టీగా ఉన్న టిడిపి తన మౌలిక విధానాన్నే మార్చుకున్నట్లయింది.అప్పటికి కూడా తెలంగాణ రాదన్నదే నేతల నమ్మకం.రెండువేల తొమ్మిది ఎన్నికలకు ముందు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలంగాణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూనే, అనేక షరతులు పెట్టి భాగస్వాములందరితో చర్చించాలని అన్నారు. అప్పటికి ఇదే జరగదులే అన్నదే భావన. అంతేకాదు.టిడిపి టిఆర్ఎస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తే రాజశేఖరరెడ్డి టిఆర్ఎస్ పై మండిపడుతూ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ కు రావాలంటే వీసా అవసరం అవుతుందేమోనని ప్రజలు అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా మరో చారిత్రక సన్నివేశమే.ఆ తర్వాత ఎన్నికలలో గెలిచాక టిఆర్ఎస్ ను బలహీనపరచడానికి ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. 

ఆ తరుణంలోనే రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం చరిత్రలో అతి పెద్ద మలుపుగా భావించాలి.మొత్తం రాష్ట్రంలోని రాజకీయాలన్నీ మారిపోయాయి.వై.ఎస్.కుమారుడు జగన్ ప్రధాన అభ్యర్ధిగా ముఖ్యమంత్రి పదవికి పోటీలోకి రావడం,దానికి అధిష్టానం అంగీకరించక సీనియర్ నేత రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం మరో చారిత్రక అంశమే.అప్పుడే తెలంగాణ నేతకు ఎవరికైనా ఆ పదవి అప్పగించి ఉన్నా,జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా చరిత్ర మరోలా ఉండేది.అంతేకాదు.జగన్ కూడా పార్టీ పెట్టే పరిస్థితి ఏర్పడేది కాదని అంటారు.జగన్ ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటించడం, అది కాంగ్రెస్ పార్టీ వివాదంగా చూడడం ,ఏకంగా సోనియా ను జగన్ ఢీకొనడం సంభవించాయి. అదే సమయంలో జగన్ తెలంగాణ లోని వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుంచి ఓదార్పు యాత్రకు సిద్దమై రైలులో వెళ్ళారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరించి రైల్లో వెళుతున్న జగన్ ను అరెస్టు చేసి వెనక్కి తీసుకు వచ్చింది.రైలుమీద రాళ్లు వేసేవారిని,మహబూబాబాద్ రైల్వేష్టేషన్ పై రాళ్లదాడి చేసినవారిని అదుపు చేయకుండా వైఫల్యం చెందింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇదో పెద్ద మలుపు. కొందరు తెలంగాణ నేతలు చెప్పినట్లు రోశయ్య వినడం వల్ల ఇలా జరిగిందని అంటారు.

ఆ తర్వాత కెసిఆర్ 14ఎఫ్ నిబందన రద్దు చేయాలంటూ దీక్షకు కూర్చోబోతే కరీంనగర లోనే ప్రభుత్వం అరెస్టు చేసింది.అక్కడ నుంచి ఖమ్మం తరలించారు. అక్కడ ఆస్పత్రిలో కెసిఆర్ పళ్ల రసం తీసుకోవడం, ఆ దృశ్యాన్ని అప్పటికప్పుడే టీవీ చానెళ్లలో ప్రసారం చేయడం అది పెద్ద సంచలనం,దానిపై ఉస్మానియాలో తెలంగాణవాద విద్యార్ధులు కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేయడం, దానితో కెసిఆర్ మళ్లీ దీక్షకు దిగడం జరిగిపోయింది. ఇది ఒక చారిత్రక సన్నివేశం.ఆ తర్వాత కెసిఆర్ ను నిమ్స్ కు తీసుకురావాలని హెఆర్సి ఆదేశించడం, అక్కడ ఆయన సెలైన్ ఎక్కించుకుంటూనే దీక్ష సాగిస్తుంటే, ఆయనకు ప్రాణ హాని ఉందని కొందరు ప్రచారం చేశారు.దానిని రోశయ్య ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందన్న అబిప్రాయం ఉంది. అప్పుడు కేంద్రంలోని కొందరు పెద్దలు కూడా కెసిఆర్ కు ఫోన్ చేసి దీక్ష కొనసాగించాలని కోరారని అంటారు.ఈలోగా రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం జరగడం, అందులో టిడిపి కూడా తెలంగాణకు అనుకూలంగా మళ్లీ మాట్లాడడం ,చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం,కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానించడం జరిగింది. 

దీంతో రోశయ్యను డిల్లీ పిలిపించి తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో పెట్టాలని చెప్పి హైదరాబాద్ పంపించడం, ఆయన విమానం ఎక్కాక ఆనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్టం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం చారిత్రాత్మక ఘట్టంగా చెప్పాలి.తెలంగాణవాదులు చేసే చలో అసెంబ్లీని ఉద్రిక్తం అవుతుందని ప్రభుత్వం నియంత్రించలేదని కూడా ఒక నివేదిక ఢిల్లీకి పంపారని,ఆ కారణం కూడా కొంత ప్రభావం చూపిందని అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఊహించని కాంగ్రస్,టిడిపి,ప్రజారాజ్యం సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు అప్పటికప్పుడు రాజీనామాలు ప్రకటించి మరో చరిత్ర సృష్టించి నిర్ణయాన్ని వాయిదా వేయించగలిగారు.ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ రావడం, నివేదిక ఇవ్వడం వంటివి జరిగాయి.కాంగ్రెస్ అదిష్టానం మళ్లీ రోశయ్యను మార్చి తెలంగణ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ గా ఉన్న కిరణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం మరో చరిత్ర.ఆ తర్వాత కొంతకాలం రకరకాల ఆందోళనలు సాగినా ప్రభుత్వం సజావుగానే ఉందన్న అబిప్రాయం కలిగింది.మిలియన్ మార్చ్, సాగరహారం,సకల జనుల సమ్మె వంటివి నిర్వహించినా ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించందనే భావనే ఏర్పడింది.కాగా తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ కలిసి,రాజకీయేతర వ్యక్తులతో జెఎసి ఏర్పడడం ఉద్యమ చరిత్రలో ఒక సరికొత్త చరిత్రగా చెప్పాలి.

ఒక దశలో కేంద్రం ప్యాకేజీకి ఓకే చేస్తే కిరణ్ శాసనసభ సమావేశాల తర్వాత ప్రకటించాలని సూచించడం, అంతలో కాంగ్రెస్ హై కమాండ్ మనసు మారడం మరో చారిత్రక మలుపు అనుకోవాలి. జగన్ వేరే పార్టీ పెట్టుకోవడం మరో సంచలనం.ఆ తర్వాత జగన్ పై హైకోర్టుకు శంకరరావు లేఖ రాయడం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కక్రు దానిపై సిబిఐ విచారణ కు ఆదేశించడం, సిబిఐ జగన్ ను అరెస్టు చేసి జైలులో నిర్భందించడం,ఇదంతా కాంగ్రెస్ కుట్ర అన్న భావన ప్రజలలో ప్రబలి ఉప ఎన్నికలలో ఆయన స్థాపించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు పట్టం కట్టడం వంటి పరిణామాలలో తెలంగాణ టిఆర్ఎస్, సీమాంధ్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు బలీయమైన శక్తులుగా అవతరించాయి.అటు టిఆర్ఎస్ ను అదుపు చేయలేక, ఇటు జగన్ ను తనదారిలోకి తెచ్చుకోలేక చివరికి మళ్లీ కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ వైపు మొగ్గు చూపే పరిస్తితి ఏర్పడింది.తెలంగాణ ఇప్పట్లో రాదని, 2014 లో ఎన్నికల తర్వాత తెలంగాణ సాధిద్దామని కెసిఆర్ ప్రకటనలు చేస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను అదిష్టానం పిలిచి సభ పెట్టించడం, ఆ తర్వాత సిడబ్ల్యుసి, యుపిఎలు సమావేశమై తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని ప్రకటించడం అత్యంత కీలకమైన చరిత్రాత్మక ఘట్టంగా చెప్పాలి.తిరిగి సీమాంధ్రలో మళ్లీ సమైక్య ఉద్యమం చెలరేగింది.

అందులో భాగంగా ఎపిఎన్జీఓలు నలభై నాలుగు రోజులుగా సమ్మె చేస్తుండడం, వారు హైదరాబాద్ లో సమైక్య సభను నిర్వహించడం కూడా చరిత్రలో భాగం అయింది.తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ జాగ్రత్తగా హేండిల్ చేశారన్న పేరు వస్తే సమైక్య ఉద్యమాన్ని పరోక్షంగాను,ప్రత్యక్షంగానో ప్రోత్సహిస్తూ చరిత్రగతిని మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్న అబిప్రాయం కలుగుతుంది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ఎదిరించి దానికి వ్యతిరేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గా చరిత్ర పుటలలోకి కిరణ్ ఎక్కడం కూడా సంచలనమే. అంతేకాదు.హైదరాబాద్ లో సమైక్య సభ జరపరాదని తెలంగాణవాదులు హెచ్చరికలు చేసినా,వాటిని పట్టించుకోకుండా ఎపి ఎన్.జిఓల సభ జరగడం కూడా ఒక ముఖ్యమైన ఘట్టమే. అయితే ఈ సభలో సమైక్యత ఎందుకు అన్నది వివరించడంలో పూర్తిగా సఫలం అయ్యారని చెప్పలేం.ఇక సీమాంద్రలో పిల్లల చదువులు పోతున్నా, బస్ లు లేక ప్రజలు నరకయాతన పడుతున్నా, ముఖ్యమంత్రి,సీమాంధ్ర మంత్రులు పట్టించుకోకపోవడం ,తెలంగాణ ఆందోళనల సమయంలో గట్టిగా వ్యవహరించి పేరు తెచ్చుకున్న కిరణ్ ప్రస్తుతం సమైక్యవాదిగా పేరు తెచ్చుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారో,లేక మరే కారణమోకాని,సీమాంద్ర లో ప్రభుత్వమే ఉద్యమం నడుపుతోందన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. ఇక రాజకీయంగా చంద్రబాబు ,షర్మిల యాత్రలు కూడా చరిత్రలో భాగమే అవుతాయి.

చంద్రబాబు నేరుగా విభజనకు అనుకూలమనిగాని వ్యతిరేకం అని చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిఆర్ఎస్ లను విమర్శిస్తూ, తెలుగు జాతి విచ్చిన్నం గురించి మాట్లాడుతూ యాత్ర సాగిస్తున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పూర్తిగా సమైక్యవాదానికి మారిపోయి ప్రచారం చేసుకుంటోంది.కాంగ్రెస్ పార్టీ నేతలు అటు పదవులు వదలకుండా, ఇటు సమైక్యవాదాన్ని వదలకుండా కధ నడుపుతున్నారు.ఇదంతా ఒక గేమ్ గా మార్చి ప్రజలతో సీమాంద్ర నేతలు ఆడుకుంటున్నారు.అయినా ఇప్పటికైతే తెలంగాణ పై నిర్ణయం మారలేదు.మరి చరిత్ర ఏ రకంగా నిర్ణయిస్తుందన్నది తేలడానికి మరికొద్ది సమయం పడుతుంది.ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో నేతల చారిత్రక నిర్ణయాలు ఉన్నాయి.చారిత్రక తప్పిదాలు ఉన్నాయి.అంతిమంగా తెలంగాణ అంశం ఎలాంటి చారిత్రాత్మక ఘట్టం అవుతుందన్నది కాలమే తేల్చాలి. 

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top