fvz

Wednesday, July 08, 2020

ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి

8 జూలై 1949 - 2 సెప్టెంబర్ 2009
'నేను ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ధైర్యంగా మైకు పట్టుకుని 'ఈ గ్రామంలో ఇల్లు లేనివాళ్లు, నిజంగానే అర్హులై ఉండీ పెన్షన్‌ రానివాళ్లు, అర్హులైన వాళ్లలో ఏ ఒక్కరికైనా తెల్లకార్డు లేనివాళ్లు ఎవరైనా ఉంటే చేతులెత్తండి' అని అడగాలి. అలా అడిగినప్పుడు ఒక్క చెయ్యి కూడా లేవకూడదు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలి' దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కన్న గొప్ప కల ఇది. తాను ఎక్కడికెళ్లినా 'గోడు ఉండకూడదు, గూడు ఉండాలి' అని కోరుకున్న మహానేత.
చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు... ఆ పాదం అడుగిడిన నేలంతా అయ్యింది సస్యశ్యామలం.. మాట తప్పని ఆయన తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపగా మడమతిప్పని ఆయన నైజం ప్రత్యర్థులకు సింహస్వప్నం అయ్యింది. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రజల గుండెల్లో పదిలంగా..

తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైఎస్సార్‌ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8 న వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజా రెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు.
అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. జగన్ మోహన్‌ రెడ్డి (కుమారుడు), షర్మిల (కుమార్తె).

వైఎస్సార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్‌.మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌లోనూ హౌస్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇదే సమయంలో వైఎస్సార్‌ కుటుంబం కళాశాల నిర్మాణం, ఆసుపత్రి ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాల్ని కొనసాగించింది. ఇటు వైఎస్సార్‌ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో, 1975లో ఆంధ్రప్రదేశ్‌ యువజన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేశారు. అలా ఆయన రాజకీయ జీవితంలో కీలక దశ మొదలైంది.
1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.
వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించి, అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
రాజకీయ నేతగా ఎదగాలనుకునే ఎవరికైనా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. ప్రజల్లోంచి వచ్చిన నేతలకు మాత్రమే వారి కష్టాల గురించి తెలుస్తుంది. వైఎస్సార్‌ ప్రజల్లోంచి వచ్చిన నేత. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతో ఉండేందుకే ప్రయత్నించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న 2003-04 సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు.
2003 వేసవిలో పాదయాత్ర చేపట్టి, దాదాపు 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రలో ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్లారా చూసి, చలించి పోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్సార్‌కు ప్రతి చోటా మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయతీని అర్థం చేసుకుని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు.
వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వైఎస్సార్‌ ముందుంటారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగు వారి సంప్రదాయమైన పంచెకట్టులోనే కనిపించేవారు. పంచెకట్టుకి ఆయన గుర్తింపు తీసుకొచ్చారు. ఇక వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు.
ఆయన నడవడిక, మాటల్లోనూ హుందాతనం ఉండేది. నిత్యం నవ్వుతూనే కనిపించేవారు. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆయన 2009 సెప్టెంబర్‌ 2న జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన భౌతికంగా దూరమైనా.. తెలుగు ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రజల జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ పదిలంగానే ఉంటారు.
వైఎస్సార్‌ 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు, పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే ఉచిత్‌ విద్యుత్‌ ఫైలుపై సంతకం చేశారు. అనంతరం ఎన్నో కీలక పథకాల్ని ప్రవేశపెట్టారు.
రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తొలిసారిగా ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించారు. పేద రోగులు సరైన ఆర్థిక స్తోమత లేని కారణంగా తగిన వైద్య చికిత్స పొందలేకపోయేవారు. అయితే ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ ఆసుపత్రిలో సరైన వైద్యం అందాలని వైఎస్సార్‌ భావించారు. ఇందుకోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనారోగ్యంతో ఉన్నవారికి, వివిధ ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు 108 అంబులెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు.
రైతులు బావుండాలంటే పంటలు పండాలి. ప్రతి పంటకూ నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలి. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన జలయజ్ఞాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు.
రేషన్‌ షాపుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు, ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top