Anchor and actor TNR dies of COVID-19, May your Soul Rest in Peace 🙏
తుమ్మల నరసింహారెడ్డి(టీఎన్‌ఆర్) దర్శకత్వంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. డిగ్రీ అయ్యాక సినిమాల మీద ఆసక్తి బాగా పెరిగింది. చిరంజీవి ఆయన అభిమాన నటుడు. చిరు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవారు. 1992లో దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ వద్ద సహాయకుడిగా పనిచేశారు. పలు చిత్రాలకు రచనలో సహకారం అందించారు. హాస్యనటుడు అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్’ చిత్రానికి స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా, దర్శకుడిగా, రచయితగా సినిమాల వైపు రాకుండా బుల్లితెరకు వెళ్లారు. పలు న్యూస్ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు.
ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, ఉన్నత స్థాయికి ఎదుగుతాడని భావిస్తున్న టీఎన్ఆర్‌ను కరోనా అమాన వీయంగా బలిగొంది. సినిమా ప్రముఖుల ఇంటర్వ్యూల ద్వారా ఆయన టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. అలాగే ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. జాతిరత్నాలు సినిమాలో కూడా ఆయన నటించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్ ఓ చానల్ యాంకర్‌గా నటించడం విశేషం. దాదాపు 15 సినిమాల్లో ఆయన నటించినట్టు సమాచారం.
టీఎన్ఆర్ ఆశలను, ఆకాంక్షలను కరోనా మహమ్మారి ఛిద్రం చేసింది. మొదట ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ఆమె కోలుకున్న లోపే, టీఎన్ఆర్, వారి ఇద్దరు పిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు.
పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో టీఎన్ఆర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చివరికి మృత్యువు అక్కున చేర్చుకుని కుటుంబ సభ్యులకు, సినీ అభిమానులకు శోకాన్ని మిగిల్చింది.