fvz

Monday, December 23, 2013

కాస్త లౌక్యం నేర్చుకో జగనూ..!

జగన్ ఎవరితో మంచిగా ఉంటారు...? 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు.   ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్ తనతో మంచిగా ఉంటారని చెప్పిన నాయకుడెవరూ కనిపించలేదు. పార్టీపై పట్టు సాధించే క్రమంలో జగన్ పార్టీలో ముఖ్యనేతలెవర్నీ తనకు చేరువ కానివ్వడం లేదు. స్వంతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఓ ముఖ్యమైన స్థానానికి చేరవలసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన రెండవశ్రేణి నాయకత్వం ఏదీ కనిపించడం లేదు. 

ఫలానా నాయకుడితో మాట్లాడితే పార్టీకి సంబంధించిన విధి విధానాలపై అవగాహన వస్తుంది. వారి ద్వారా జగన్‌కు మన మనసులోని అభిప్రాయాలను చెప్పవచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయంపై హామీ పొందవచ్చుననే భరోసా కార్యకర్తలకు కనిపించడం లేదు. పార్టీ విస్తరిస్తున్న క్రమంలో నాయకత్వానికి సంబంధించి ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నాయకత్వం అవసరం. పార్టీ విధివిధానాలపై ప్రతినిధులకు తోడుగా సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలి. 

అందుకు పార్టీ అధినేత అవకాశామివ్వాలి. వైఎస్‌ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చాలాకాలం పాటు జగన్‌కు సన్నిహితంగా మెలగుతూ పార్టీ వైఖరిని ఖరారు చేయడంలో సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, కరుణాకర రెడ్డి, సబ్బం హరి తదితరులు ఎందరో కీలకపాత్ర పోషించారు. పార్టీ భవిష్యత్ విధానాల గురించి మీడియాకు తెలియజేసేవారు. అలాంటి సబ్బం హరి తమ పార్టీ సభ్యుడు కాదని జగన్ ప్రకటించుకున్నారు. ఆ తరువాత సుబ్బారెడ్డిని పక్కన పెట్టారన్న వార్తలు వినవచ్చాయి. కొణతాల రామకృష్ణను కేవలం అనకాపల్లి లోక్ సభకు పరిమితం చేసారు. దాడి తండ్రీ కొడుకులను విశాఖకు మార్చారు. ఇలా ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేసారు.   జగనన్న వదిలిన బాణం ఎక్కడా ...?

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహాప్రస్థానం నిర్వహించి జనంలో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను పెంచిన సోదరి షర్మిల ఒక్కసారిగా పార్టీ సమావేశాల్లో కనిపించకుండా పోయారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీలో నాయకత్వలోటు ఉండకుండా విజయమ్మ, షర్మిల యాత్రలు జరిపి జనం మద్దతు సంపాదించారు. అలాంటి వారిని ఒక్కసారిగా పక్కకు తీసేయకూడదు. పైగా ప్రత్యర్థులు వేయికళ్లతో చూస్తున్నపుడు, వారికి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదు.   

రాజశేఖర రెడ్డి వ్యవహారం ఇలా కాదు. ఆయన ఎక్కడిక్కడ కొంతమంది నమ్మకస్తులను ఏర్పాటు చేసుకునేవారు. వారి ద్వారా పనులు నడిపేవారు. వారికి కూడా స్వంత పనులు చేసుకునే అవకాశం ఇచ్చేవారు. రాజకీయాల్లో ఇది సహజం. ఇలా చేయకుంటే రాజకీయాలు నడపలేరు. జగన్ వ్యవహారం ఇలా కాదు. మీకేం కావాలి.. మీ వ్యవహారం మీరు చూసుకోండి..పార్టీ వ్యవహరాలు, పక్క నియోజకవర్గాలు సంగతి మీకు అనవసరం అన్న వైఖరి.  

నిజానికి చంద్రబాబు ది కూడా ఇదే వైఖరి.కానీ ఆయన ఇంత మొరటుగా, మోటుగా వ్యవహరించరు. లౌక్యంగా వుంటారు. అందరి నుంచి సమాచారం అందుకుని తెలివిగా తన నిర్ణయం తాను తీసుకుంటారు. ఏ ఒక్కరిని దూరం పెట్టరు.దగ్గరగా వున్నట్లే అనిపిస్తారు. కానీ నిర్ణయాలు అన్నీ తనమే. ఇది రాజకీయ లౌక్యం. జగన్ కు ఇదే కొరవడినట్ల కనిపిస్తోంది. గతంలో నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా వేసిన వారిలో కొందరి పనితీరు బాగాలేదన్న సాకుతో తప్పించి వారి స్థానంలో కొత్తవారిని వేశారు. దీంతో పార్టీ నేతల్లో అభద్రతా భావం పెంపొందే అవకాశం ఉంది. ఎప్పుడు ఎవర్ని ఎక్కడ ఉంచుతారో? తీసేస్తారో తెలియని పరిస్థితి ఉంటే పార్టీ నాయకులు కృతనిశ్చయంతో పనిచేసే అవకాశం ఉంటుందా?  


ఇలా అయితే ఎలా...? 

రాజకీయాలు నడపడం వేరు, వాటిని ఎంతవరకు వెల్లడించాలో, అంతవరకే వెల్లడించడం వేరు. ఇప్పుడు ఎన్జీవోల రాజకీయాలు కూడా ఇదే. అసులు ఇందులో జగన్ ఇప్పుడు వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? వేలు పెట్టినా బహిరంగంగా బయటపడాల్సినంత అగత్యం ఏముంది. అశోక్ బాబు కిరణ్ మనిషి అని ముద్రపడ్డారు. ఆ ముద్ర అలా వుండనిస్తే ఆయనే తగ్గిపోయి వుండేవారు. గడచిన పదిహేను రోజులుగా నిజానికి అశోక్ బాబు చాలా వరకు తగ్గిపోయారు. అలా వదిలేసి వుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన కాస్తా హీరో అయిపోయారు. జగన్ వర్గంతోనే ఫైట్ చేస్తున్నంతగా వైకాపా ప్రత్యర్థులు బిల్డప్ ఇస్తున్నారు. 

ఈ ఎన్నికల్లో కాస్త తేడా జరిగిందంటే, జగన్ ఓడిపోయినంత ప్రచారం సాగుతుంది. ఈ సంగతి జగన్ గుర్తించలేదా లేక, గుర్తించి ధీమా పడుతున్నారా అన్నది అనుమానం. ఎన్జీవోల వంటి పెద్ద వర్గం రాజకీయాల్లో వేలు పెట్టడం వేరు, వేలు పెట్టినట్లు చాటు కోవడం వేరు. తెలంగాణ జేఎసిలో వున్నవాందరి మధ్య ఐక్యత, ఏక రూపత వుందని అనుకోవడం భ్రమ. కానీ ఓ తాటిపై వుండాల్సిన అవసరం కాబట్టి వున్నారు. అదేవిధంగా ఎన్జీవొల జెఎసి సభకు వెళ్లి వస్తే పోయిందేముంది? ఆదికి ముందే అశుభం పలకడం ఎందుకు? సమైక్యం ఎజెండా కాని వారికి అక్కడ స్థానం వుండాలో వద్దో అటు ఎన్జీవోలు లేదా ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. మధ్యలో వైకాపా బద్నామ్ కావడం ఎందుకు?  

మీడియా మేనేజ్మెంట్...? 

మీడియాలో సింహభాగం జగన్ కు వ్యతిరేకం అన్న సంగతి చెప్పనక్కరలేదు. జగన్ తన స్వంత మీడియాను నమ్మకున్నారు. మరి కొంత మంది పార్టీ అనుకూలురు వున్నారు. కానీ వీరంతా నేరుగా పబ్లిసిటీ వ్యవహారాలు చూస్తున్నారు కానీ, పరోక్ష ప్రచారాన్ని సాగించడం లేదు.  నెట్ సర్వేలు, నెట్ వార్తల పట్ల కూడా జగన్ వర్గం నిమ్మకు నీరెత్తినట్లు వుంటోంది. టీవీ పోల్ సర్వేలు, నెట్ సర్వేలు వంటి వాటిలో తెలుగుదేశానిదే పైచేయిగా వుంటోంది. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వున్నాయి. 

నెటిజన్లు అంతా తెలుగుదేశం అనుకూల వైఖరితో వున్నారని కొందరు. లేదు తెలుగుదేశం ఐటి వింగ్ ఇలాంటి వాటిని బాగా మేనేజ్ చేయగలదని మరికొందరు అంటున్నారు. ఏది నిజమైనా జగన్ పార్టీ ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఇండియా టుడే మామూలుగా సర్వే చేస్తే వచ్చిన ఫలితాలకు, ఆన్ లైన్ సర్వేకు శత సహస్రం తేడా వచ్చిందంటే ఏమని అనుకోవాలి? ఎక్కడో ఏదో జరుగుతోంది అనుకోవాలి.  ఇప్పటికైనా జగన్ తన వైఖరి కాస్త మార్చుకోవాలి. రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో వుండడం అంటే ముఖానికి ఎప్పుడూ నవ్వు పులుముకోవాలి అన్న సత్యం తెలిస్తే చాలదు..ఆచరణలోకి కూడా రావాలి. ఆ విషయంలో జగన్ కన్నా బాబు, కిరణ్ లే బెటరన్న దాంట్లో అనుమానం లేదు.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top