In Remembrance of Uday Kiran


కడతేర్చుకు వెళ్లిపోయావా నేస్తం! 
చాలంటూ రంగులప్రపంచాన్ని వదలి 

తలపోసినవేవీ కొనసాగకపోగా 
అంతర్మధనం బరువు బరువు కాగా 
అటు చూస్తే.. ఇటుచూస్తే.. ఎవరూ 
చిరునవ్వూ చేయూతా ఇవ్వక` 
మురికితనం కరకుతనం 
నీ సుకుమారపు మనసుపొరకు గాయంచేస్తే 
అటుపోతే, ఇటుపోతే అంతా 
అనాదరణతో, అలక్ష్యంతో చూసి.. 
ఒక్కణ్నీ చేసి వేధించారని, బాధించారని.. 
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళిపోయావా, నేస్తం! 
కడతేర్చుకు వెళిపోయావా, నేస్తం!

దొంగలంజకొడుకులసలే మెసలే 
ఈ సినీలోకంలో కొనసాగజాలక 
కడతేర్చుకునే వెళిపోయావా, నేస్తం! 
చిరునవ్వులనే  లోకానికి వదిలేసి... 
అడుగడుగునా పొడచూపే 
అనేకానేక శత్రువులతో పొంచి, 
చీకట్లో కరవజూసే వంచకాల సినీజగతితో 
పొసగక ఒత్తిళ్లెరగని మానసిక ప్రశాంతత` 
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్‌ నేస్తం! 

ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం! 
ఎన్ని ఆశలు బతుకుపై పెట్టుకున్నావో.. 
ఎన్ని కలలు హీరోగా నిర్మించుకున్నావో.. 
అన్నీ తన్నివేశావా, నేస్తం! 
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం! 
‘మనసంతా నువ్వే’లో ఇంకా నిన్నగాక 
మొన్న నీ ప్రేమను చూసినట్లే ఉంది 
‘చిత్రం’ గ్రాండ్‌ ఎంట్రీ తోటే తెలుగమ్మాయిలు 
దాచేసుకున్న నీనవ్వు కనబడకుండా 
కరిగిపోయిందా ఇంతట్లోనే! 
‘నువ్వు`నేను’ పునాదుల మీద నువ్వు 
నిర్మించుకున్న కలల సౌధం జ్ఞాపకం ఉందా? 

టాలీవుడ్‌ రంగుల తీరంలో 
నువ్వు అన్నీ పిచికగూళ్లేనా కట్టింది? 
సినిమానే సమస్తం అనుకొని, ఆకలీ, నిద్రా లేక,  
ఎక్కడ ఉన్నావో, ఎక్కడకు పోతావో తెలియని ఆవేశంతో,  
చుక్కలలో అవకాశాలను లెక్కిస్తూ ఎక్కడకో పోతూన్న 
నిన్ను రెక్కపట్టి నిలబెట్టి ఈ లోకం 
ఎన్నెన్ని వక్రపు మోసాలను చూపించి, 
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,  
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి, 
శపించిందో, శఠించిందో కదా నిన్ను! 
తుదకు నిన్ను అనంతాత్మక్షోభలోన ముంచి 
భవిష్యత్తుపై అనురక్తిని మొగ్గలోన తుంచి 
అభిమానుల్లో విలాపాగ్నులు, 
వారి గుండెలలో ఆగ్రహజ్వాలలు  రేపి 
నీబాటలోని యువతరం దారిలో 
భయాల బ్రహ్మచెముడు డొంకలు కప్పి... 
నిను తలచుకున్నప్పుడెల్లా తనువులో, అణువణువులో 
అత్యంత భయంకర అనుమానాలను రేకెత్తిస్తూ 
ఎక్కడకు వెళిపోయావయ్యా నువ్వు! 

ఎందరి కళ్లు తెరిపిస్తావయ్యా నువ్వు! 
ఎవరు దు:ఖించారులే నేస్తం! 
నువ్వు చనిపోతే, ఏదో ఆప్తులూ, 
అభిమానులూ కొందరు తప్ప! 
ఆకాశం పడిపోకుండానే ఉంది! 
ఆఫీసులకు సెలవులేదు! 

సినీ కోటరీలలో ఫుల్‌బాటిళ్లు 
ప్రతిసాయంత్రం గల్లుమంటూనే ఉన్నాయి! 
కమ్మిన టీవీ గొట్టాల మధ్య సాశ్రు 
నేత్రాలు ప్రదర్శించిన వారు కొందరే! 
పొంచిన టీవీ కన్నులకు చిక్కక 
ఇళ్లలో పార్టీ చేసుకున్న వారే అనేకం! 
ఎవరి ఆనందంలో వాళ్లు! 
ఎవరి అక్కసుతో వాళ్లు! 
ఎవరికి కావాలి, నేస్తం! 
ఏమయిపోతేనేం నువ్వు? 
ఎవ్వరూ నీకై విలపించడం లేదులే! 
ఎవరికి కావాలి, నేస్తం!

నువ్వు మనోఫలకంపై ఒక 
తూటాకు బలి అయితే, 
కనబడని విరక్తి నిన్ను కబళిస్తే 
అందని చేయూత నిన్ను మంత్రిస్తే! నిమంత్రిస్తే! 
ఎవరికి కావాలి నీ నేస్తం! ఏమయిపోతేనేం నువ్వు? 
ఎవరి బురదతో వారు రోజూ తయారు! 
ఎవరి బురఖా వారు తగిలించుకున్నారు! 
అందరి కళ్లకూ అసూయలు మొలిచాయి! 
అందరి మెదళ్లనూ కుట్రలు కరిచాయి! 
వారిని నువ్వు పోల్చుకోలేవు! లేదు, నేస్తం! లేదు... 
నీ వైభవగతం వారిని భయపెట్టక మానలేదు! 

కుట్రలతో ఆశల్ని కూల్చేయడం  
నీమీదనే ప్రయోగించారు వాళ్లు! 
నీ వెనక గోతులు తవ్విన శక్తుల బలం మాకు తెలుసు! 
విచారం వద్దులే అయినప్పటికీ! 
ఎంత కుట్రకు అంత శిక్షను` 
పైవాడు ఇప్పటికే వారికి ప్రసాదించే ఉన్నాడు! 
నీ సాహసం ఒక ఉదాహరణ! నీ జీవితమే ఒక పాఠం! 
నిన్న నీదైన పోరాటమధనం ఇవాళ అందరిదీ కాక తప్పదు! 
కావున ఈ కుట్రలు నిండిన 
రంగుల ప్రపంచంలో నీ చావు డప్పు మోగిస్తున్నది! 
ఇక్కడి సజీవి పిశాచాల హననానికి 
నీ ఆత్మ ప్రేతాత్మగా పూనుకోవలసి ఉన్నది! 
అందుకో.. ఈ ఆవాహన మంత్రం.. 
సినీజగతి బాగుకోసం ఆహ్వానపత్రం... 
ఇలా చూడు ఓ నేస్తం 
నీ జీవితమొక క్షుభిత వంచిత మహాప్రస్థానం...

Source: Greatandhra.com

Next Post Previous Post