‘పలికించెడి వాడు’ చంద్రబాబేనా?తెలుగు రాజకీయాల్లో ఇవాళ ఓ సంచలన ఘట్టం చోటు చేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకుడు దాడి వీరభద్రరావు... పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మీద నిశితమైన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఘోరంగా ఆడిపోసుకున్నారు. తల్లి విజయమ్మ ఓడిపోవడానికి కూడా జగన్‌ స్వయంగా కారకుడు అనడం కంటె పెద్ద ఆరోపణ వేరొకటి ఉండకపోవచ్చు. ఆయన ఇవాళ వైకాపా కు రాజీనామా చేశారు. వైకాపా కాలగర్భంలో కలసిపోయే పార్టీ అని... అలాంటి పార్టీలో ఉండి ఇంకా తప్పు చేయదలచుకోలేదని.. ఇంకా మనిగిపోవడం తనకు ఇష్టం లేదని దాడి వీరభద్రరావు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. షర్మిల ఎంపీ అయితే.. పార్టీలో తనకు పోటీగా మరో పవర్‌ సెంటర్‌ తయారవుతుందనే ఉద్దేశంతోనే ఆమెను వాడుకుని, ఎదగకుండా తొక్కేశారని పేర్కొన్న దాడి, తల్లిని చెల్లినే నమ్మనివాడు.. ఇక ప్రజలను ఎలా నమ్ముతాడంటూ.. చెరిగేయడం విశేషం.  ప్రతిసారీ ఎన్నికల తర్వాత.. అధికారంలోకి రాకుండా ఓడిపోయిన పార్టీకి ఇలాంటి ఎదురుదెబ్బలు కొన్ని తగులుతూనే ఉంటాయి. 

రాజకీయాల్లో అది సహజం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్లంతా రాజశేఖరరెడ్డి పట్ల అభిమానం ముడిపెడితే.. ఒక్క పార్టీలో చేరిన వారే తప్ప.. ఇతరత్రా ఎజెండాల్తో వచ్చిన వారు కాదు గనుక.. ఆ పార్టీలో ఇంకా ఇలాంటి ఇబ్బందులు బయటకురావడం లేదు. అయిదే దాడి వీరభద్రరావు పరిస్థితి వేరు. ఆయన తొలిసారిగా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. బజార్న పెట్టారు.  ఇప్పుడు ఆరోపిస్తున్న వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ విషయానికి వద్దాం. దాడి వీరభద్రరావు మొన్నమొన్నటివరకూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. ఎమ్మెల్సీగా కూడా పదవిని అనుభవించిన వ్యక్తి.  ఆ పదవిని చంద్రబాబు మళ్లీ కొనసాగించలేదనే అలకంతో పార్టీని వీడి, జగన్‌ను జైలులో కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాను విన్న జగన్‌.. జైలులో కలిసిన జగన్‌ ల మధ్య ఎంతో తేడా ఉన్నదని ఆనాడు చెప్పారు. (ఇప్పుడు- జైలులో చూసిన జగన్‌, బయట ఉన్న జగన్‌ వేర్వేరు అని చెబుతున్నారు.) అయితే ఇదే దాడి వీరభద్రరావు తెలుగుదేశంలో ఉండగా.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మీద ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు గుప్పించారు. అన్నీ చాలా తీవ్రమైనవి. ఆయన వైకాపాలో చేరగానే.. వాటి గురించి అందరూ ఆయన్ను ప్రశ్నించారు. 

‘అప్పట్లో తెదేపాలో ఉన్నాను గనుక.. ఆ పార్టీ విధానాల ప్రకారం అలా విమర్శించానే తప్ప.. అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కాదంటూ’ దాడి సమర్థించుకున్నారు. తద్వారా.. ‘తాను పార్టీ పలకమన్నట్లు పలికే చిలకను మాత్రమే’ అని దాడి పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.  సరిగ్గా ఈ పాయింటు గుర్తున్న వారికి.. ఇప్పుడు ఆయన జగన్‌ మీద చేసిన విమర్శల విషయంలోనూ కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎవరి విధానాలకు అనుగుణంగా ఈ విమర్శలు చేస్తున్నారో అని అనిపిస్తోంది. దాడితో ఇలాంటి విమర్శలు చేయిస్తున్నవారు, తద్వారా వైకాపా పనైపోయింది అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తున్న వారు వేరే ఉన్నారని అంతా అనుకుంటున్నారు.  అప్పట్లో దాడి వీరభద్రరావును చేర్చుకోవడం ద్వారా జగన్‌ చాలా పెద్ద త్యాగం చేశాడని చెప్పాలి. పార్టీకి పెద్దదిక్కుగా... పార్టీనే నమ్ముకుని ఉన్న వైఎస్సార్‌ ఆప్తుల్లో ఒకరు కొణతల రామకృష్ణ ఎంతగా వ్యతిరేకించినా.. జగన్‌ పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రలో ఈ ఇద్దరు నాయకులు రెండు గ్రూపులుగా మారితే.. అది పార్టీకి చేటు చేస్తుందనే హెచ్చరిక అందినప్పటికీ పట్టించుకోలేదు. దాడిని చేర్చుకున్నారు. 

అప్పుడు హితవాక్యములను పెడచెవిన పెట్టినందుకు ఫలితం అనుభవిస్తున్నాడా అన్నట్లుగా ఇప్పుడు దాడి వీరభద్రరావు జగన్‌ మీదనే అస్త్రాలు ఎక్కుపెట్టాడు. తమాషా ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాడి వీరభద్రునికి పాత యజమాని.. అనగా నారా చంద్రబాబునాయుడు.. విశాఖపట్టణంలో కేబినెట్‌ మీటింగ్‌ పెట్టడానికి వెళుతున్న రోజునే.. ఆయనను సంతుష్టుడిని చేసే విధంగా.. దాడి వీరభద్రరావు ఈ విమర్శలు చేయడం విశేషం. భవిష్యత్తు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు గానీ.. బహుశా ఈ టూరులో చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. ‘‘పలికెడిది భాగవతమట... పలికించెడి వాడు రామభద్రుండట’’ అని పోతన సవినయంగా మనవి చేసుకున్నట్లుగా.. ‘పలికెడిది వీరభద్రుడట.. పలికించెడిది చంద్రబాబుయట’’ అని పాడుకోవాల్సి వస్తుంది. Next Post Previous Post