వైఎస్ విగ్రహ ఏర్పాటుకు ఎన్నారైల వినతి

ప్రజల కోసమే బతికి, వారి సేవ కోసం వెళ్తూ అకాల మరణానికి గురైన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని భారత పార్లమెంట్ ప్రాంగణంలో నెలకొల్పాలని వైఎస్ఆర్ యువసే యూఎస్ఏ కమిటీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత సామాజిక సాధికారక శాఖా మంత్రి డి. నెపోలియన్ కు వైఎస్ఆర్ యువసేన కమిటీ ప్రతినిధులు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి నెపోలియన్ తో మాట్లాడుతూ ప్రజా సేవలో భాగంగానే ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు వైఎస్ విగ్రహాన్ని భారత పార్లమెంట్ లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.

ప్రభుత్వం ఇందుకు అంగీకరిస్తే వైఎస్ విగ్రహాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా నెపోలియన్.. వైఎస్ఆర్ యువసేన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు కూడా ఈ విషయంలో ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ లో వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటు గురించి చర్చిస్తానని వైఎస్ఆర్ యువసేన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
Next Post Previous Post