ఇదయ :

పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక -అంటూ సంసారపక్షపు నడిపాత ఆంధ్రపత్రికనే చడామడా దులిపాడు శ్రీశ్రీ!
కూడబలుక్కున్నట్టు చెలరేగి తెలుగు జనానికి పిచ్చెత్తేలా బుద్ధి శుద్ధి చేస్తున్న గొప్ప పత్రికల దూకుడును ఈ కాలంలో చూసి ఉంటే మైకం ఠక్కున దిగి మహాకవి ఏమి చేసేవాడో!
ఏమి రాసేవాడో!! ప్రపంచం ఎంతో ముందుకు పోయినా, జర్నలిజం గురించి మన అవగాహన మాత్రం తాతలకాలం దగ్గరే ఆగిపోయింది. ఇది చాలా బోలెడు ఘోరం.
కాకి బంగారపు దీపాల్లా ధగధగ వెలుగుతున్న రాజా పత్రికలను చూసైనా నిక్కమైన పత్రికా రచన అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోవటం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం.
ఉదాహరణకు – ప్రజలకు దారి చూపాల్సిన పత్రికను నడిపే వాడికి కొంచెం నీతి, కాస్త నిజాయతి, రవంత వృత్తి నిబద్ధత, ఆవగింజలో వెయ్యోవంతు నిష్పాక్షికత, సత్యసంధత ఉంటాయని,
ఉండాలని మనం చాదస్తంగా అనుకుంటున్నాం. తప్పు! పత్రికను నడిపించేవాడికి కనీసం కిరోసిన్‌ను స్మగ్లింగ్ చేసిన లోకోత్తర పూర్వానుభవమైనా ఉండి ఉండాలి. వెధవది కిరసనాయిలునే సరిహద్దు
దాటించి వేరే రాష్ట్రానికి చేరవేయలేనివాడు ప్రజాప్రయోజనాలను సమస్యలు దాటించి సురక్షిత గమ్యానికి ఎలా చేరవేయగలడు? అలాగే – పాచినోటితో లోకానికి నీతులు
ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా
పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా
అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా
గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు. అదే మాదిరిగా – పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన
మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత
మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే…
ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!! గోబెల్స్, గోబెల్స్ అని అందరూ తెగ అంటారు కాని గోబెల్స్ గాడిది ఏమి గొప్ప?
ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని కనిపెట్టటమే కదా అతగాడు ఊడబొడిచిందల్లా?! అదే మన పుణ్యఫలం కొద్దీ మన పాలబడ్డ పత్రికారాజాలను చూడండి. నిజాన్ని
తిరగవేసి అబద్ధంగా, అబద్ధాన్ని మరగవేసి నికార్సయిన నిజంగా చూపించి… గోరంతను కొండంతగా, కొండంతను గోరంతగా అవసరాన్నిబట్టి, ఆయా వ్యక్తులనుబట్టి, వారి మీద
తమ ఇష్టానిష్టాలనుబట్టి, కులదైవాల ప్రయోజనాలనుబట్టి, పక్కా వ్యాపార స్వార్థాలనుబట్టి ఎలా తారుమారుగా తిమ్మినిబమ్మి చేసెయ్య వచ్చో తెలుగు పత్రికా మణిదీపాలను చూసే ఎవరైనా నేర్చుకోవాలి!
మాటవరసకు – ఉషోదయంతో అసత్యం నినదించుగాక అని శపథం పట్టిన నీతుల మారి పెద్ద పత్రిక ఒకానొక గాలిరెడ్డి అవినీతి గనుల్ని కూలీ అడక్కుండా కష్టపడి, కళ్లు తిరిగేలా తవ్విపోసింది.
ఫలానా గనుల్లో ఎన్ని వేల కోట్లు గోల్‌మాల్ అయిందీ కచ్చితంగా కాకుల లెక్క గట్టి వెరిజనాన్ని ఔరా అనిపించింది. నాలుగు రోజుల తరవాత మళ్లీ అదే నోటితో, అంతే నేర్పుతో…
సదరు గనుల ఖనిజం బహు నాసిరకమని, దాని పేరు చెప్పుకుని వేరే రాష్ట్రంలో ఇంకెక్కడో తవ్వకాలు జరిగాయనీ కొత్త కథను అల్లింది. ఔను మరి! ఎప్పుడూ ఒకే కథ అయితే చదివేవాళ్లకు బోరు కదా?!
జగన్ అనే పరమపాపికి ఫలానా అధికారులు నోటీసు ఇచ్చారని సంబరంగా రాసే పత్రిక… అదే పరిస్థితి తమ అభిమాన నాయకుడికి ఎదురైతే ‘‘ఏదో లేఖ రాసారంతే’’ అని తక్కువ చేసేస్తుంది.
పుణ్యాత్ముడు బాబు మీద తస్మదీయుల కేసు అయితేనేమో ‘‘వై.ఎస్. విజయ పిటీషన్ విచారణకు స్వీకరణ’’ అని చప్పగా చెప్పే మేటి పత్రిక అదే తాము పగబట్టిన పాపాత్ముడిపై
అస్మదీయుల కేసులో అలాంటి నిర్ణయమే వస్తే ‘‘సిబిఐ బోనులో జగన్’’ అని ఉత్సాహంగా ఉరకలేస్తుంది. తాము పగబట్టిన వాడికి ఎమ్మెల్యేలు జై కొట్టినా, మిడిమేలపు మీడియాకు
అది చీకొట్టినట్టే వినపడుతుంది. పాపిష్టి విరోధి ఢిల్లీకి వెళితే అక్కడి పెద్దల కాళ్లావేళ్లా పడి దేబిరించినట్టు! మహారాజశ్రీ బాబుగారు అలాంటి టూరే చేస్తేనేమో జాతీయ నాయకులతో భేటీ వేసినట్టు!
మన వాళ్ల మీద దృష్టి పెడితే అది ‘కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’! అదే మన పగవాళ్లమీద కన్ను వేస్తేనేమో అది నిప్పులాంటి నిష్ఠాగరిష్ఠ దర్యాప్తు సంస్థ. ఇలా ప్లేటు మారుస్తారేమిటంటే –
హైకోర్టు ఆర్డరు ప్రకారం దర్యాపు కాబట్టి వంకలేదని వింత వివరణ! ‘తమరు కళ్లకద్దుకుంటున్న ఆర్డరును ప్రసాదించిన వారికి వేరేదో పెద్ద కుర్చీ దక్కిందట కదా’ అని మనం అడగాకూడదు.
వారు విననూ కూడదు! సిబిఐ కచేరీ తమ సొంత టీవీ స్టూడియో అయినట్టు, సర్కారీ పత్తేదారులు తమ కొలువులోని యాంకర్లు అయినట్టు, అక్కడ ఎవరిని ఏమి అడిగేదీ, ఎవరు ఏమి చెప్పేదీ,
తరవాత ఏమి జరగబోయేదీ కెమెరాలు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్టు అమాయక జనానికి చెవిలో పూలు పెట్టటం తెలుగు మీడియా మోతుబరుల ప్రత్యేకత!
ముఖ్యమంత్రి మహాశయుడు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే నిరసన నినాదాలను జయజయ ధ్వానాలుగా చిత్రించి… ప్రతిపక్ష మహానాయకుడితో భుజం
కలిపి ఏలినవారి పల్లకి మోసి తరించే మీడియాను వీక్షించటం మన పూర్వజన్మ సుకృతం. శత్రువును పాతరెయ్యటం కోసం ఎంతకైనా బరితెగించి,
ఎన్ని నిలువుల లోతైనా నిజాన్ని పాతిపెట్టగలగటమే ఈ కాలపు పత్రికా ధర్మం!!


Next Post Previous Post