WRITTEN BY RAJU . . .

భాషకే జీవం ఉంటే ఆత్మహత్య చేసుకొనేది. పదాలు... పరువు పోయినందుకు ప్రాణత్యాగం చేసేవి.
మన రాష్ట్రంలో నేతల భాష చూసి రాజకీయం సిగ్గుతో తలవంచుకొంటోంది. నాయకులు కాట్లాడుకుంటున్న తీరు చూసి ప్రజానీకం నివ్వెరపోతోంది.
ఒకప్పుడు రాయడానికి వీలుగాని భాషగా భావించే భాషను నిజమేంటో ఎవరి నైజమేంటోతేటతెల్లంగా చెప్పేందుకు ఇప్పుడు రాయక తప్పని పరిస్థితి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రాజకీయ నాయకులు రాష్ట్రంలో బూతు పురాణానికి తెరతీశారు.
నోటికి అడ్డూఅదుపూ లేకుండా.. మంచిమర్యాదా లేకుండా ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటున్నారు.
అప్పుడెప్పుడో... జంధ్యాల బతికున్నప్పుడు తన సినిమాల్లో బ్రహ్మానందం, సుత్తి జంటతో పలికించినదానికన్నా విచిత్రమైన.. వింటేనే వికారం కలిగించేలా ఉండే కొత్త కొత్త తిట్లను సృష్టించి మరీ రాజకీయ ప్రత్యర్థులపై సంధిస్తున్నారు.
నరంలేని నాలుకతో నవ్య విన్యాసాలు చేయిస్తున్నారు! ప్రజాసేవలో కనిపించని గొప్ప సృజనాత్మకతను తిట్లపురాణం లంకించుకోవడంలో చూపిస్తున్నారు.
స్థాయి మరచి.. సభ్యతా సంస్కారాలను విడిచి ఒకరినొకరు కసితీరా దూషించుకుంటున్నారు. నాలుకలు కోస్తామంటూ అవే నాలుకలతో నోటికి వచ్చినట్లు పరస్పరం తిట్టుకుని నోటి తీట తీర్చుకుంటున్నారు.
"అబద్ధానికి పెద్ద కొడుకువి, నరరూప రాక్షసుడివి, తాగుబోతువి, సన్నాసివి, దగుల్బాజీవి, గుంట నక్కవి, లంగవి, లఫంగివి, లుచ్ఛావి'' అంటూ వినరాని, వినలేని మాటలతో తిట్ల దండకం వల్లిస్తున్నారు.
వాళ్లూవీళ్లూ అని లేదు... టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీల నేతలూ ఆ తానులో గుడ్డలే!
బూతుపురాణంలో సరికొత్త అధ్యాయాల సృష్టికర్తలే! "కుట్రలకు కేరాఫ్ అడ్రస్ నువ్వు. నువ్వు చేసిన పాపాలు గంగా నదిలో మునిగినా.. పన్నీరుతో కడిగినా పోవు.
నికృష్టమైన నాయకుడివి. విద్రోహంలో హీనమైన గతం నీది. వంచనలో అతి నికృష్టుడివి. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో మనుషులను మాయం చేసిన మాయావివి. నీ బతుకే కుట్రలమయం''
అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఘాటు విమర్శలపై.. టీడీపీ నేతలు అంతే ఘాటుగా స్పందించారు.
"నీ నాలుకనూ, నిన్నూ రెండుగా చీలిస్తే తప్ప.. నీకు బుద్ధి రాదు'' అంటూ కేసీఆర్‌పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.
"ఈ యుగానికే నరరూప రాక్షసుడివి. వసూల్ రాజావి. నీ కన్నా నీచ నికృష్ట కుసంస్కారపు నేత మరొకరు లేడు'' అంటూ కేసీఆర్‌పై తలసాని శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు.
"తాగుబోతూ.. జాగ్రత్త. నీ నోటిని ఫినాయిల్‌తో శుద్ధి చేసుకో. నీది నోరు కాదు.. మూత్రశాల'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై దేవేందర్ గౌడ్ మండిపడ్డారు.
"పిచ్చి కుక్క కరిచినందునే కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు'' అని తీగల కృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల తిట్లుకు కేసీఆర్ కూడా దీటుగానే స్పందించారు.
"మీదే కుటిల నీతి, నీచ, దుష్ట సంస్కృతి'' అంటూ మండిపడ్డారు. ఇక.. 'మీరేనా తిట్టుకొనేది.. మేం మాత్రం తక్కువ తిన్నామా?' అన్న రీతిలో కాంగ్రెస్ నేతలూ తిట్లపురాణంలో భాగస్వాములయ్యారు.
"తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కుక్కవి కాబట్టి కుక్క బుద్ధులొచ్చాయి. కనీసం ఎలా మాట్లాడాలో నీకు తెలియడం లేదు'' అంటూ చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి నిప్పులు చెరిగారు.
"చంద్రబాబు కారుకూతలు మానుకోకుంటే.. కుక్క నాలికను కోసినట్లు ఆయన నాలుక కోస్తాం. ఆయనను మించిన నక్క మరొకటి ఉండదు'' అని మండిపడ్డారు.


Next Post Previous Post