fvz

Thursday, January 01, 2015

సింగపూర్‌ జపం - మనకి సరిపడని మంత్రం !!! పర్యవసానాలేమిటో?

ప్రపంచ పటంలో ఆ దేశం చూడటానికి ఒక చిన్నడాట్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మన తెలుగింటి ఆడపిల్ల పెట్టుకునే బొట్టుబిల్లంత. అక్కడ పాడీ ఉండదు, పంటలూ ఉండవు. కనీసం చూడటానికి కోళ్ళు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, వీధి కుక్కలు, పందులు ఇవేవి కంటికి కనిపించవు. రైతు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదు , రైతులు వాడే తట్టా, బుట్టా, కొడవళ్ళు,గడ్డపారలు, చలకపారలు అంటే అస్సలే తెలియదు. వ్యవసాయం అంటే ఏమిటో వాళ్లకి తెలియదు. మనం రోజు తినే కూరగాయలు ఎలా పండిస్తారో వాళ్ళకి తెలియదు. పల్లె వెలుగు, సెట్ విన్, ఎర్రబస్సులూ , బస్సుల్లో ఉండే కండక్టర్లు, వాళ్ళు కొట్టే టికెట్లు ఎలా ఉంటాయో అక్కడి వాళ్లకి తెలియదు. వోల్వో బస్సు బోల్తా, స్కూల్ బస్సు బోల్తా,  స్కూల్ బస్సును డీకొని విద్యార్థిని దుర్మరణం, లారీ బోల్తా,  ఇసుక లారీ బోల్తా, ఇటుక లారీ బోల్తా, పాల వ్యాను బోల్తా, లారీ ఆటో డీ, టూవీలర్ ఆటో డీ, సిటీ బస్సు ఆటో డీ, సిటీ బస్సు టూవీలర్ డీ, మినీ లారీ కారు డీ, గ్యాస్ సిలండర్ పేలి తండ్రీకూతురు దుర్మరణం...& సో సో  లాంటి తాటికాయంత ఎర్రటి అక్షరాలతో ఆక్కడ న్యూస్ పేపర్లు ఏ ఒక్క రోజు కూడా అచ్చు కావు.


గ్యాస్ పైప్ లైన్లు పేలి జనాలు చచ్చిపోవడం, స్కూల్ పిల్లల బస్సులను రైలు డీ కొట్టడం, రెడీమేడ్ భవనాలు కుప్పకూలి కూలీలు చచ్చిపోవడటం, తూఫాన్లు, భూకంపాలు, సునామీలు రావడటం కానీ , లంచాలు ఇవ్వటం, తీసుకోవటం కానీ, పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళినవాడు మళ్ళి క్షేమంగా  ఇంటికి తిరిగోస్తాడా అన్న సందేహాలు కానీ, వారసత్వ రాజకీయాలు, వారసత్వ సినిమా హీరోలు, నేను ఇలాగే సినిమా తీస్తా చూస్తారో లేక చస్తారో అనేవాళ్ళు గానీ, రాజకీయ నాయకులు అలగటాలు బుజ్జగింపులు, రాత్రికి రాత్రే రాజకీయపార్టీ కండువాలు మార్చే నాయకులు గానీ, కిడ్నాపులు చేయడం, రేపులు చేయటం, కరెంటు కోతలు, కులాల ప్రాతిపదికలకు గానీ ఆ దేశ రాజ్యాంగంలో చోటు లేదు. నేను  'భాయ్' ని , 'బాస్' ని, 'కింగ్' ని , ఇంకా మాట్లాడితే 'కిల్లర్' ని  ఇదే నా 'నిర్ణయం' అన్నా, ఇంకోడు వీడు 'ఇడియట్', 'పోకిరి', 'దేశముదురు', 'జులాయి' అవునా కాదన్నా 'నేనింతే' , కాదూ ఇతను 'లెజెండ్', 'సింహం' అంటూ వైగరా గట్రా  అని (కులాల తోకలు) తగిలిచ్చుకొని  మహా స్టార్, బర్నింగ్ స్టార్, రైసింగ్ స్టార్ అంటూ బిగ్ స్క్రీన్ మీద బిగ్గరగా తొడలు  కొట్టి, మీసాలు మెలేస్తే అక్కడ ఎవడికీ పట్టించుకునేంత సమయం ఉండదు. 


ఫలానా ఊర్లో ఎక్కడో వేలాది కిలోమీటర్ల దురాన ఉన్న ఆ ఊరు ఎన్. ఆర్.ఐ (అమెరికా) హీరోలందరూ కలిసి ఊరి గుడికి,బడికి, శ్మశానానికి, మంచినీళ్ళ కి  చందాలు ఇవ్వడం, గవర్నమెంట్  బడిలో పాఠాలు చెప్పే హెడ్ మాస్టర్ కి ఆ అమెరికా బిర్యానికి అలవాటుపడ్డ బుడ్డ హీరోలు (డాలర్ బాబులు) సన్మానాలు చేయడం, గవర్నమెంట్ లేదా ప్రజా ప్రతినిధులు చేయాల్సిన ఊరులోని అరా కొరా పనులను ఈ ఎన్.ఆర్.ఐ. లు తమ భుజాలకెత్తుకొని మిగతా ఊరి ఎన్.ఆర్.ఐ ల దగ్గర చందాలు పోగేసి ఆ ఉరిని ఫినాయిల్ తో శుబ్రం చేసి చంకలు గుద్దుకొని ఫోటోలకు ఫోజులిచ్చి మరుసటి రోజు మేము (ఎన్.ఆర్.ఐ లము) ఫలానా పనిని వెలగబెట్టాము ఈ రోజు మన న్యూస్ పేపర్ చూసి తరించండని కానీ, అమెరికన్ డాలర్ల కోసం నాయనమ్మని, చంటి పిల్లని కిడ్నాపు చేసి అతి కిరాతకంగా చంపిన  వర్ధమాన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమెరికా ఎన్.ఆర్.ఐ. డేడ్లి స్టార్ యండమూరి రఘునందన్ లాంటి వాళ్ళు కానీ, దేశం తరుపున టీం ని క్రికెట్ ఆడటానికి విదేశాలు పంపిస్తే రాత్రి పూట పడుకునే బెడ్ ని  వేడి చేయటం కోసం  గర్ల్ ఫ్రెండ్స్ ని  వేసుకొని రాత్రిళ్ళంత ఊరేగటం కానీ, చేతిలో ఒక పిల్లాడిని, చంకలో ఒక పిల్లని, కడుపులో ఇంకో పసిగుడ్డుని పెంచుకుంటూ జనాభా నియంత్రణ అంటే అర్థం తెలియని మనుషులు కానీ, ఎంత మంది ఆడపిల్లలు పుట్టినా పర్లేదు, కానీ ఒక్క మగపిల్లాడు వారసుడు మాత్రం అవసరం అనే వాళ్ళు కానీ, ఒప్పుకుంటే ప్రేమిస్తాను, పెళ్లి అంటే మాత్రం కట్నం, కులం, గోత్రం  కావలి అనే సన్నాసులు గానీ, సామాజిక న్యాయం కోసమే నా జీవితం అంకితం, 24/7 బ్రేకింగ్ న్యూస్ చానళ్లోల్లు, కులాన్ని రుపుమాపుదాం, మద్యాన్ని నిషేదిద్దాం, నా కోసం, నీ కోసం, మన బాసలు ఊసులు, మనసులో మాట, మనలో మన మాట, మనందరి బాటా, అరిసలు బూరెలు గారెలు పూతరేకులు లాంటి  ప్రోగ్రామ్స్  ఆ దేశం మీడియాలో కంటికి కనిపించనివి,  చెవులకు వినిపించనివి.ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.

సింగపూర్ దేశం మొత్తం జనాభా 56 లక్షల మంది. ఆ దేశం మొత్తంలో రోజుకి 24 గంటల పర్యంతం, సంవత్సరానికి 365 రోజుల చొప్పునా  ఆక్కడ కరెంటు లైట్స్ తో ఇండ్లు, రోడ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు ఓ వెలుగు వెలిగి పోతుంటాయి. కరెంటు కోతలు అంటే ఆక్కడ కలలో కూడా రాని ఒక ఉహా..!! ఆ దేశంలో స్కూల్ కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడతారు. ఇంగ్లీష్ భాషను ప్రధానంగా పరిగణిస్తారు. బస్సు స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పబ్లిక్ పార్కులు, షాపింగ్ సెంటర్లు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజనీరింగ్, ఫ్యూచర్ ప్లానింగ్, ఫైర్ రెసిస్టoట్, వాటర్ రెసిస్టoట్, భూకంపాలు, సునామీలు తట్టుకునే విధంగా పక్కా ప్రణాళిక బద్దం తో కట్టబడినవి.ప్రపంచ ప్రసిద్ధ ప్రఖ్యాతి గాంచిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీల  డేటా సెంటర్లు, హెడ్ఆఫీసులనీ, బ్రాంచి ఆఫీసులనీ ఎదో ఒకరుపంలో ఆసియా ఖండంలోని  ఈ సింగపూర్ ఐల్యాండ్ లో కొలువుదీరి ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ తయారీ రంగంలో, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థలు, విద్యా వైద్య రంగాలలో సింగపూర్ దేశంను  ఒక దిట్టగా చెప్పుకోవచ్చు. ఇవికాక  హోటల్ రంగం, టూరిజం, కాసినోలు, పార్క్ లు  పర్యాటకులకు నిరంతరం వినోదాన్ని పంచుతుంటాయి.

ప్రపంచంలో అత్యుత్తమ రుచికరమైన ఇటాలియన్, కొరియన్, జపనీస్, థాయ్, మలయ్, ఇండియన్, చైనీస్, కివీస్ అన్నీ రకాలవంటకాలు అక్కడ లభ్యం అవుతాయి. ఇవి కాక మెక్ డోనాల్డ్ , కే.ఎఫ్ సి, సబ్ వే  లాంటి వరల్డ్ ఫుడ్  చైన్స్ అదనపు ఆకర్షణలు. అక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతీ డాలర్ కు ప్రపంచంలో అత్యంత నాణ్యమైన వస్తువులు, వంటకాలు, దుస్తులు కోసం చూస్తారు. నాణ్యత లేదంటే ఒక్క డాలర్ కూడా జేబు లో నుంచి బయటకు తీయరు.

దేశంలో  సామాన్య ప్రజలకు అత్యుత్తమ  భద్రత కల్పించడం సింగపూర్ గవర్నమెంట్ ప్రధాన అంశం. భద్రత విషయం గురించి ఇక్కడ ఒక్క చిన్న విషయాన్ని గుర్తుచేసుకుందాం. 298 మంది ప్రయాణీకులతో అమ్స్ స్టర్ డం నుంచి కౌలాలంపూర్ వస్తున్నఎం.ఎచ్. 17 విమానాన్ని ఉక్రెయిన్ యుద్ద గగనతలంలో పేల్చివేస్తే ప్రపంచం మొత్తం నివ్వెరపోయి ఈ దుర్ఘటనను అన్నీ దేశాలు తీవ్రంగా ఖండించాయి. యూరోప్, భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. కానీ కౌలాలంపూర్ పక్కనే ఉన్న పొరుగు దేశమైన సింగపూర్ మాత్రం ఇంటర్నెట్ మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో తమ దేశ విమానాలు ఆ ఉక్రెయిన్ యుద్ద గగనతలంలో వెళ్ళవు, మన దేశ విమానాల రూట్ మార్చాము అని దేశ ప్రజలకు భరోసా ఇచ్చే పనిలో ఆ రోజు మొత్తం ప్రతీ సెకను తల మునకలైoది. ఎక్కడో ఖండాంతరాల దురాన ఉన్న దేశాలు తమకి  జరిగిన విమాన దుర్ఘటన ఫై సంతాపం తెలుపుతుంటే, పక్కనే ఉన్న సింగపూర్ దేశం నుంచి ఒక్క సందేశం కూడా రాకపోవడం ఫై మలేషియా మీడియా గుర్రుమంది. మరుసటిరోజుకు తేరుకొని సింగపూర్ దేశం తమ సంతాపాన్ని ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా తెలియజేసింది. సామాన్య ప్రజలకు అత్యుత్తమ  భద్రత భరోసా అన్నది సింగపూర్ గవర్నమెంట్ మొట్టమొదటి సూత్రం.

ఇక భరోసా విషయం గురించి అనుకుంటే, ఓ ఆడపిల్ల ఒంటి మీద ఒక కేజీ బంగారం వేసుకొని, చేతిలో రెండు ఐ-ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్ లో కావల్సినంత క్యాష్  పెట్టుకొని రాత్రి ఒంటిగంట పూట  ప్రశాంతంగా సింగపూర్ రోడ్ల మీద దేశం మొత్తం తిరిగి హాయిగా తెల్లవారు జామున ఇంటికి చేరుకోవొచ్చు. ఇది సింగపూర్ దేశం ఓ సగటు మనిషికి ఇచ్చే భరోసా. సో ఒక సగటు మనిషి భద్రతా, భరోసా విషయాలలో ఒక్క మాటలో చెప్పుకుంటే సింగపూర్ ని ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా పరిగణించవచ్చు. తుపాకీ గన్నులు, డ్రగ్స్  అక్కడ చెవులకు వినిపించని పదాలు, కంటికి కనిపించనివి. ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద ఉమ్ము వేయడం, పాన్ పరాగ్లు, గుట్కాలు, జర్దాలు నమిలి ఉమ్మేయడం, సిగరెట్లు కాల్చి పీకలు రోడ్ల పడేయటం, వాటర్ తాగేసి బాటిల్స్ రోడ్స్ మీద పడేస్తానంటే అక్కడ కుదరదు. రైల్లో, బస్సు లో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయోచ్చు, అంతే కానీ ప్రయాణం మధ్యలో నాకు ఆకలి వేసింది, వెంట తెచ్చుకున్నది విప్పి తినేస్తానంటే ఊరుకోరు. ప్రతీ అర కిలోమీటర్ మేర ఐదు లేక ఆరు డస్ట్ బీన్స్ ఉంటాయి. వ్యర్థాలు ఎదైనా, ఏవైనా  సరే డస్ట్ బీన్స్ లో మాత్రమే పడేయాలి. అక్కడ పోలీసు వాళ్ళకి పని కొంచం తక్కువే. ఎందుకంటే నిఘా కేమెరాలే పెద్ద పోలీసులు. ఒక్క మాటలో చెప్పాలంటే డస్ట్ బీన్స్  కన్నా నిఘా కేమెరాలే ఎక్కువ ఉంటాయి. అక్కడ ప్రతీ మనిషి వాళ్ళ ఇళ్ళలో నాలుగు గోడల మధ్య ఉండేది, జరిగేదే వాళ్ళ వాళ్ళ  ప్రైవేటు జీవితం, ఒక్క సారి పబ్లిక్ రోడ్ మీదకు వచ్చాక ఆ నిఘా కామేరాళ్ళలో వాడి బతుకు మొత్తం ఓ పెద్ద సినిమా గా తయారయిద్ది. సింగపూర్ దేశం మొత్తంలో నలుమూలలా ఎప్పుడైనా ఎక్కడైనా రోజుకు 24 గంటల చొప్పునా చీమ చిటుక్కుమన్నా ఆ నిఘా కామేరాల్లల్లో రికార్డు అయి కూర్చుంటుంది. ఒక్క సారి కంప్యూటర్ బుట్టన్ నొక్కితే ఆ తప్పు చేసిన చీమ ఎవరో ఇట్టే చెప్పేస్తుంది. సో అక్కడ తప్పు చేయాలనే ఆలోచనని బుర్రలోనే సమాధి చేసుకోవడం తప్ప వేరే దిక్కు ఉండదు. చెస్ నన్నెవరూ చూడటం లేదు, తెలిసో తెలియకో నా ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేస్తాను అనుకుంటే వాడి ఖర్మను  బూడిదలో వాడే కాల్చుకున్నట్టే.

ఇక ఉద్యోగాల విషయానికొస్తే అన్నీ రంగాలలో ఉన్న కంపెనీ కీలక శాఖలన్నీ(అకౌంట్స్, డైలీ ఆపరేషన్స్, సెక్యూరిటీ, మేనేజ్మెంట్ తదితర) సింగపూర్ దేశ పౌరులకే కట్ట బెట్టడం జరుగుతుంది.  ఏ రంగంలో అయినా నెలకు మూడున్నర లక్షలు లేక ఆపైన జీతం తీసుకునే ఉద్యోగులను ప్రధమ శ్రేణిగా, లక్ష నుంచి మూడు లక్షల లోపు జీతాలు తీసుకునే ఉద్యోగులను ద్వితీయ శ్రేణిగా, నెలకు లక్ష లేక అంతకన్నా దిగువ జీతాలు  తీసుకునే ఉద్యోగులను త్రుతీయ శ్రేణిగా చెప్పుకోబడతారు. ఐ.టి, బిల్డింగ్స్ నిర్మాణంలో, హోటల్ రంగంలో, మినీ లారీ డ్రైవర్స్, మెరైన్, రిటైల్ తదితర రంగాల్లో పని చేసేందుకు అర్హత, అనుభవం ఉన్నఇతర దేశాల (ఇండియన్స్, శ్రీలంకన్స్ , పాకిస్తానీయులు, మలేషియన్స్, ఇండోనేషియన్స్...) పౌరులకు అవకాశం ఇస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో దాదాపు ముప్పై శాతం మంది విదేశీయులే పనిమంతులు. కొత్తగా చదువు పూర్తి చేసినవారికి అక్కడ అవకాశాలు చాలా చాలా తక్కువ. ఐ.టి. రంగంలో సరైన విద్యార్హతలు, అనుభవం లేనిదే అక్కడ పనిచేయడం కష్టం. సిఫార్స్లు,  రెఫెరెన్సులు, మా మామ కొడుకు, మా అక్క కూతురు, మా మేనల్లుడు, మనోడే కొంచం చూడు అని విషయం సరుకు పసలేని రేస్యుమేలు ఫార్వర్డ్ చేస్తే ఉద్యోగం రెండు నెలలకే ఉస్టింగ్ అయి ఇంటికి పంపించడం ఖాయం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఎక్కువ మంది కన్సల్టెంట్స్ మన ఉత్తర భారతీయులే ఉంటారు. ఎలాంటి రంగలో అయినా, ఎలాంటి ఉద్యోగం అయినా అక్కడ డబ్బులిస్తే రాదు. కేవలం విద్యార్హతలు, ఆయా రంగాల్లో అనుభవం బట్టి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయి. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే డబ్బులిస్తే సింగపూర్ లో ఉద్యోగం ఇప్పిస్తాము అంటే అది అబద్ధం అని లెక్క. ఒకవేళ మీకు నిజంగా ఎదైనా సింగపూర్ కంపెనీ నుంచి ఆఫర్ వస్తే, మీకు ఉద్యోగం ఆఫర్ చేసిన కంపెనీ లేక కన్సల్టెన్సీ గురించి ఆన్ లైన్లో క్షుణ్ణం గా పరిశీలించుకున్నాక నిర్ధారణకు రండి. అంతే కానీ ఉద్యోగాలు, డాలర్లు, విదేశీ మోజుతో ఉన్నత చదువులు చదివి అడ్డమైన యదవలందరికీ డబ్బులు కట్టి మోసపోవడం కరెక్ట్ కాదు.



























2007లో  వెలువడిన ఐక్యరాజ్యసమితి వార్షిక మానవాభివృద్ధి సూచిక ప్రకారం ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని  చిన్న ద్వీపమైన ఐలాండ్ ప్రపంచంలో అత్యునత జీవన ప్రమాణాలు కలిగిఉన్నది. అయితే 2008లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడిదారీ సంక్షోభం పర్యవసానంగా ఆ దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చాలా మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలిసిన పరిస్థితి ఏర్పడింది. 2008లో వచ్చిన సంక్షోభం నేర్పిన పాఠాలు మరిచిపోయి ఏ క్షణాన  పెలుతాయో తెలియని భారీ బుడగలఫై ఆధారపడిన ఆర్థిక బూమ్ లను పెట్టుబడిదారీ పండితులు పొగడటం జరుగుతూనే ఉన్నది. అలాంటి భారీ బుడగలఫై నిర్మించబడిందే ఆగ్నేయాసియాలోని నగర రాజ్యం సింగపూర్. ఈ దేశంలో జరుగుతున్నఆర్ధికాభివృద్ధి ఐలాండ్ తో సారూప్యం కలిగిఉండటమే కాకుండా దీని ముగింపు కూడా ఐలాండ్ తరహాలోనే ఉండే అవకాశం కనపడుతున్నది.

2009-2013 మధ్య పశ్చిమ దేశాలలోను , జపాన్ లోను నెలకొన్న అతి తక్కువ వడ్డీ రేట్లకు తోడుగాఅమెరికన్ ఫెడరల్ రిజర్వు (మన రిజర్వు బ్యాంకులాంటిది) 'పరిమాణాత్మక సడలింపు (క్వాంటిటేటివ్ ఈజింగ్)' విధాన్నాన్ని ప్రవేశపెట్టటంతో డాలర్ల వరద ఏరులైపారి వర్ధమాన దేశాలను చేరింది. ఇలా చేరిన సట్టా వ్యాపార లక్షణంగల 'హాట్ మనీ' నాలుగు లక్షల కోట్ల (ట్రిలియన్ల డాలర్లు) ఉంటుందని ఒక అంచనా. 2008 ఆర్థిక సంక్షోబం తరువాత 'హాట్ మనీ'  ప్రవాహాలు, అమెరికా కేంద్ర బ్యాంకు విధానాలు కలిసి సింగపూర్ డాలరు విలువ 22 శాతం పెరగటానికి దారితీశాయి. సింగపూర్ ఆర్థిక వ్యవస్థను నడుపుతూ సుసంపన్నతను సాధించామనే బ్రాంతిని కలజేస్తున్న భారీ పరపతి బుడగ ప్రభావంలో ఆ దేశం ఉన్నది. ఏ క్షణమైనా పేలడానికి సిద్దంగా ఉన్న ఈ తరహా సింగపూర్ ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ఆదర్శంగా చెబుతున్నారు. సర్వకాల సర్వావస్థల్లోనూఆ దేశ జపమే చేస్తున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు వివిధ కీలక రంగాల్లో ఆ దేశ భాగస్వామ్యానికి తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఈ పరిణామం తెలుగు ప్రజలకు ఎలాంటి పర్యవసానాలను కొనితెస్తుందో కాలమే చెబుతుంది.

సింగపూర్ గవర్నమెంట్ (అక్కడి ప్రభుత్వాలు) రాసుకున్నరూల్స్ బుక్ కి తలవంచుకుని తిరిగే వాడికి ఆ దేశం ఒక స్వర్గం.  లేదంటే రంగు పడుద్ది.

Republic of Singapore

Formation
 - Founding = 6 February 1819
 - Self-Government = 3 June 1959
 - Independence From the United Kingdom = 31 August 1963
 - Merger with Malaysia = 16 September 1963
 - Expulsion from Malaysia = 9 August 1965
Area
  - Total = 718.3 km2
Capital = Singapore [Downtown Core, Central]
Official Languages = English, Mandarin, Malay and Tamil
Official Scripts = Roman (Latin) Script, Simplified Chinese and Tamil
Demonym = Singaporean
Currency = Singapore Dollar [SGD]
Date Format = dd/mm/yyyy
Drives on the = Left
Calling Code = +65
ISO 3166 Code = SG
Time Zone = SST (UTC+8)
Population
 - 2014 estimate = 54,69,700

Written By - Vennela

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top