fvz

Saturday, January 31, 2015

మారిన జగన్...
హిందూ దేవాలయాల సందర్శన 
పీఠాధిపతుల ఆశీర్వాదం కోసం తపన 
అన్ని వర్గాల మెప్పు కోసం ఆరాటం 
వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వైఖరిలో మార్పు వస్తోంది. నిన్నటివరకూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా మసలిన జగన్ ఇపుడిపుడే తీరు మార్చుకుంటున్నారు. పార్టీ  నాయకుల మాట కూడా వింటున్నారు. తన కార్యక్రమాలలో స్ధానిక నాయకుల మాటకు కూడా విలువ ఇస్తున్నారు. ఒక రోజు పర్యటన కోసం ఇటీవల  నగరానికి వచ్చిన జగన్ వైఖరిలో గణనీయమైన మార్పు ఈ విధంగా కనిపించింది.  

ఎంతసేపూ క్రిస్టియానిటీకి విలువ ఇచ్చే వైఎస్ జగన్ ఈసారి మాత్రం హిందూ దేవాలయాల చుట్టూనే పరిభ్రమించారు.  ఒక్క రోజు పర్యటనలోనే ఆయన హిందువుల మనసు చూరగొనే రెండు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తాను అందరి వాడినని అనిపించుకునేందుకు యత్నించారు. నగరంలోని సుప్రసిద్ధ దేవాలయంగా ఉన్న సింహాచలంలోని అప్పన్నను ఆయన సందర్శించారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అక్కడ ఉన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకోవడం ద్వారా హిందూ ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించారు. అదే విధంగా, హిందువుల కోసం నిరంతరం పోరాడుతున్న పీఠాధిపతులలో ప్రధమ స్ధానంలో ఉన్న పెందుర్తి శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర మహాస్వామి వారి పీఠాన్ని సందర్శించడం అందరినీ ఆకట్టుకుంది. నిత్యం ఇతర మతాలపై, మరీ ముఖ్యంగా క్రైస్తవ మతంపై విరుచుకుపడే స్వరూపానందేంద్ర స్వామి వారి సన్నిధికి జగన్ వెళ్లడం నిజంగా ఆయనలోని గుణాత్మకమైన మార్పునకు సంకేతంగానే భావించాలి. మత మార్పిడులకు వ్యతిరేకంగా స్వామిజీ ప్రసంగాలు చేయడం కూడా జరుగుతోంది.  

అలాగే, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హిందూ మతాన్ని గౌరవించే టీడీపీకి, క్రైస్తవ మతానికి ప్రాతినిధ్యంగా ఉన్న వైసీపీకి మధ్య పోరాటంగా యావత్తు సమాజం భావించేలా చేయడంలోనూ పలువురు పీఠాధిపతులు కీలకమైన భూమిక పోషించారు. వారి కారణంగా కూడా వైసీపీ పరాజయం పాలైంది. ఈ నేపధ్యంలో నిత్యం చర్చిలలోనే ప్రార్ధనలు చేయడం, హిందువుల దేవాలయాలను కనీసంగా కూడా సందర్శించకపోవడం, బొట్టు కూడా పెట్టుకోకపోవడం వంటి కఠినమైన నియమాలను పాటించే జగన్ ఈ తీరున ఏకంగా హిందూ మతానికి సంపూర్ణ మద్దతుదారుగా ఉన్న స్వరూపానందేంద్ర స్వామి ఆశ్రమానికి రావడం రాజకీయ వర్గాలలోనూ ఆసక్తిని గొలిపింది.  


అక్కడ చాలాసేపు గడిపిన జగన్ శారదాపీఠం వార్షికోత్సవాలను తిలకించారు. స్వామిజీతో ఏకాంతంగా చాలాసేపు గడిపారు. ఈ పరిణామంతో జగన్ హిందూ సమాజం పట్ల తనకు ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించుకున్నారనే చెప్పాలి. అదే సమయంలో మెజారిటీ హిందువుల మనసును కూడా ఆయన గెలుచుకున్నారు. ఇక, నగరంలోని ఆర్‌కె బీచ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జగన్ సందర్శించడం కూడా స్ధానిక నాయకుల అజెండాగానే ఉంది.  


అలాగే, ఈసారి పర్యటనలో పెందుర్తి, సింహాచలంలోని నాయకులతో చనువుగా ఉంటూ, వారి సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌లోని వైసీపీ కార్మిక సంఘం నాయకత్వంలోని ఉద్యోగులను కూడా ఆయన పలుకరించడం ద్వారా రానున్న స్టీల్ ఎన్నికలలో తమ సంఘం గెలుపు కోసం బాటలు వేశారు. మొత్తం మీద చూసుకుంటే ఎపుడూ తన మాటే నెగ్గాలనే పంతం మీద ఉండే జగన్ ఈసారి అలా కాకుండా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించింది.  


రానున్న రోజులలో మరోమారు జగన్ విశాఖ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ఫిబ్రవరి  న ప్రారంభించనున్నారు. దాంతో, తన రాజకీయ కార్యక్షేత్రంగా విశాఖను మలచుకోవాలని జగన్ యోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ రకంగా మారుతున్న పరిస్థితులను గమనంలోకి తీసుకుంటూ తదనుగుణంగా కార్యాచరణను కనుక రూపొందించుకుంటే తప్పకుండా జగన్ సర్వజనామోదం పొందుతారని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు.  


జగన్ మారిన తీరు పట్ల పార్టీ కేడర్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ఆర్ సైతం సింహాచలం అప్పన్నను దర్శించుకోవడమే కాకుండా, శారదాపీఠాన్ని కూడా సందర్శించిన సందర్బాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. నాడు ప్రతిపక్ష నాయకుని హోదాలో రాజశేఖరరెడ్డి ఇక్కడకు వచ్చి వెళ్లిన తరువాతనే అధికారం చేపట్టారని, అదే సెంటిమెంట్ జగన్‌కు కూడా వర్తిస్తుందని వారు సంబరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జగన్‌లో వచ్చిన మార్పు వైసీపీకి మంచి రోజులు తెస్తాయని అంతా ఆశిస్తున్నారు. 


పివిఎస్‌ఎస్ ప్రసాద్, 
విశాఖపట్నం. 
Source: GA

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top