ఇందిర జలప్రభ పథకంలో ‘ప్రభ’ లోపించింది. అణగారిన వర్గాల కోసమంటూ అట్టహాసంగా ప్రారంభించిన పథకం కాస్తా అట్టర్ ఫ్లాపయింది. లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకున్న సర్కారు ఆచరణలో చతికిలబడింది. గత ఏడాది మహాత్మాగాంధీ జయంతి రోజున ప్రారంభించిన ఈ పథకం ఏడు నెలలు గడిచినా ఒక్కడుగూ ముందుకు కదలలేదు. కొత్త బోర్లు వేయడం, మోటార్లు బిగించడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చడం ఈ పథకం ముఖ్యోద్దేశం. రెండేళ్లలో లక్ష బోర్లు ఏర్పాటు చేయాలని ఘనంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, మొదటి ఏడు మాసాల కాలంలో కేవలం 1,800 బోర్లు మాత్రమే వేశారు. వాటిలోనూ ఏ ఒక్కటి కూడా.. నేటికీ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదంటే సర్కారు నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అవగతమవుతుంది. మొదటి సంవత్సరంలో ఆరు లక్షల ఎకరాలు, రెండో సంవత్సరంలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.1,800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మొదటి ఏడాది ఆరు లక్షల ఎకరాలు సాగులోకి తేవాలంటే 10 ఎకరాలకు ఒక బోరు చొప్పున 60 వేల బోర్లు వేయాల్సి ఉంది. అంటే నెలకు 5 వేల బోర్ల చొప్పున వేస్తేగానీ లక్ష్యం నెరవేరదు. పథకం ప్రారంభించి ఏడు నెలలు అవుతుండగా 35 వేల బోర్లు వేయాల్సి ఉన్నా.. ఇప్పటికి 1,801 బోర్లు మాత్రమే తవ్వారు. వీటిలోనూ ఒక్కటి కూడా పంటలకు నీరందించేందుకు సిద్ధం కాలేదు. బోర్లు వేసిన కొన్నిచోట్ల విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడం, ఇచ్చినా మోటారు లేకపోవడం సమస్యలతో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క బోరు కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు.





0 Comment :
Post a Comment