మహాసంగ్రామానికి నాంది . . . జోరువానలోనూ.. జనప్రవాహం

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పళణి థియేటర్ సర్కిల్ రోడ్‌షోలో ప్రసంగిస్తుండగానే వర్షం మొదలైంది. అయినా జనం కట్టుకదల్లేదు.. అంత వానలో ఉద్వేగంగా జగన్ ప్రసంగిస్తుంటే.. అంతే ఆత్రుతగా అభిమానులు వింటూ వర్షాన్నే మరచిపోయారు. తర్వాత జగన్ ముత్యాలరెడ్డిపల్లె బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడా జోరు వానలో తడుస్తూనే ప్రసంగించారు. జనం కూడా వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వర్షం పడుతున్న సమయంలో ఆయన ఆకాశం వైపు చూసి రెండు చేతులెత్తి వరుణ దేవునికి నమస్కరించుకున్నారు.

ఆ దృశ్యాన్ని చూసిన జనం ‘వాళ్ల నాన్న లాగే వర్షం అంటే జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఎంతో ఇష్టం’ అంటూ మాట్లాడుకున్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతి చేరుకున్న అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి 11.35 గంటలకు నగర శివార్లలోని ఆటోనగర్ నుంచి రెండో రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలో 10 జంక్షన్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన్ను చూసేందుకు ఎండను లెక్కచేయక మిద్దెలపైన, భవనాల పైన కూడా గంటలకొద్దీ జనం వేచి ఉన్నారు. రోడ్‌షోలో తన ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి.. పచ్చ చీర రంగు అవ్వా.. కళ్లద్దాల అవ్వా.. చెల్లెమ్మా.. అంటూ జననేత పిలుస్తుంటే జనం పులకించిపోయారు. కాగా బుధవారం సాయంత్రం తిరుపతి ప్రచారం ముగించుకున్న జగన్.. తర్వాత కడప వెళ్లారు. గురువారం ఉదయం నుంచి ఆయన రాజంపేటలో ప్రచారం నిర్వహిస్తారు.
Next Post Previous Post