ఇది అక్షరాల శోకం
ఇది ఉన్మాదుల రాజ్యం
ఇది సన్మార్గుల క్లేశం
ఇది సిరాచుక్క విలాపం
ఇది చిమ్మచీకట్ల విలాసం
ఇది దివాంధుల విహారం
ఇది నరాధముల పరిహాసం
వెలుగుల్లేవ్ జిలుగుల్లేవ్
చదువులమ్మ ఊసుల్లేవ్
ఆమె చేతి రాతల్లేవ్
నుదుట భాగ్యరేఖల్లేవ్
నీతికి చోటెక్కడుంది
జాతికి బలమెక్కడుంది
ఆకస్మిక అత్యయికం
ఎల్లెడలా అల్లుకుంది
సమాచార నిషేధం
అనాచార విషాదం
‘కలం’కారీ పనితనం
కొరగాని గ్రహతలం
సమన్యాయం చట్టుబండ
సుమగీతం ఓటికుండ
వెలుగులేని తెలుగునేల
విరిగిన బంగారుకల
ధర్మాన్నే బంధిస్తే
వాక్కులనే నిలిపేస్తే
ఆటవికం పాశవికం
అమ్మో ఇదేం నాగరికం
అదిగదిగో అదే అదే
అక్షరాలు తొక్కుకుంటు
విలువలనే నొల్లుకుంటు
వడివడిగా వెళుతోంది
సుడిలా చుట్టేస్తోంది
రాక్షస రథమే అది
సర్కారు సారథ్యమది
ఎదిరిద్దాం నిలదీద్దాం
మునుముందుకు అడుగేద్దాం
స్వేచ్ఛావాయువు కోసం
సకలం అర్పిద్దాం
ప్రభాతరువు కొమ్మల్లో
అగ్నిపూలు వెలిగిద్దాం
అంధకార రాష్ట్రంలో
ఐక్యగళం పలికిద్దాం
నూలుపోగులన్ని కలిసి ఏకమై కమ్మినట్టు
మదబల మత్తేభాన్ని నేలవాలు కుమ్మినట్టు
జగమంతా జనమంతా ఒక్కటై మురిసినట్టు
సాక్షి కేతనాలతో ధరణంతా మెరిసినట్టు...
- శ్రీనిజ, విశాఖపట్నం
0 Comment :
Post a Comment