YS JAGAN AT RAJAMPETA

* చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
* నేతన్నలకు వృద్ధాప్య పింఛను రూ.1,000కి పెంచుతాం
వైఎస్ కేటాయించిన నిధులేమయ్యాయి?
మహానేత వైఎస్ బతికున్నప్పుడు.. చేనేతల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి బడ్జెట్‌లో రూ.312 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత రెండు నెలలకే ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆ 312 కోట్ల రూపాయల రుణమాఫీ ఏం చేశారు? అని ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుడిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. నిరాహార దీక్షలు చేశాం.. ధర్నాలు చేశాం.. అయినా పట్టించుకోలేదు. ఇలాంటి ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ అమరన్న(అమర్‌నాథ్‌రెడ్డి) పదవీ త్యాగం చేయడం మంచిది కాదంటారా?
వైఎస్ ఉన్నప్పుడు రూ.16 వేలు.. ఇప్పుడు రూ.2,500
ఇవాళ మనం గ్రామాలకు వెళ్లి చూస్తే ఏ రైతు ముఖాన చిరునవ్వు లేదు. ఇక్కడ చాలా మంది పసుపు రైతులున్నారు. గ్రామాల మీదుగా వచ్చేటప్పుడు వారిని కలిసి మాట్లాడా. అన్నా.. పసుపు రేటెలా పలుకుతుందన్నా అని అడిగా.. ‘అన్నా ఇవాళ పరిస్థితి ఎలా ఉందీ అంటే.. పుట్టి రూ.700 పలుకుతా ఉంది. ఉడకేసి అమ్మితే క్వింటాలు పసుపు రూ.2,500 కూడా రావట్లేదన్నా’ అంటూ ఆ రైతన్న అంటుంటే చాలాచాలా బాధనిపించింది. ఆ రైతు ఇంకో మాట కూడా అన్నాడు.. వైఎస్ ఉన్నప్పుడు క్వింటాలు పసుపు రూ.16 వేలు పలికిందన్నా అంటూ ఆ సువర్ణయుగాన్ని గుర్తుచేసుకున్నాడు. నేను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా.. త్వరలో మహానేత గర్వపడేలా ఆ సువర్ణయుగాన్ని తిరిగి తెస్తానని భరోసా ఇస్తున్నా.
వచ్చే సువర్ణయుగానికి నాంది
ఈ ప్రభుత్వం రైతుని, పేదవాడిని, చేనేత కార్మికుడిని పట్టించుకోవట్లేదు. ఇలాంటి ప్రభుత్వానికి నిరసనగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు వచ్చే సువర్ణయుగానికి నాంది పలకనున్నాయి. ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మామూలుగా పదవి వదులు కోవాలీ అంటే చాలా బాధపడతాడు. ఏ రైతన్న కోసమో, పేదవాడి కోసమే ఆ పని చేయాలీ అంటే ఇంకా వెనకడుగు వేస్తాడు. ఐదేళ్లకోసారే కదా ఆ పేదవాడితో, రైతన్నతో పనిపడేది అని ఆలోచిస్తాడు. కానీ అమరన్న(ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి) అలా అనుకోలేదు. తన పదవి పోతుందని తెలిసినా, ఉప ఎన్నికలు వస్తాయీ అన్న విషయం తెలిసినా.. నిజాయతీతో కూడిన రాజకీయాలు చేశాడు.. పేదవాడికి తోడుగా నిలబడ్డాడు. అలా నిలబడినందుకు డిస్‌క్వాలిఫై అయ్యి.. పదవి పోగొట్టుకున్నాడు. రాష్ట్ర పాలకులకు, వారిని ఢిల్లీ నుంచి రిమోట్‌తో నడిపిస్తున్న పెద్దలకు ప్రజల బాధ తెలిసేలా ఉప ఎన్నికల తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.

Next Post Previous Post