YS JAGAN FAN VINOD SUICIDE May His Soul Rest In Peace

జగన్‌ను ప్రభుత్వం, కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ వేధిస్తున్నాయంటూ ఆవేదన
ఇది తనకెంతో బాధ కలిగించిందని, తట్టుకోలేకే చనిపోతున్నానని పేర్కొంటూ సూసైడ్ నోట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వ వేధింపులను చూసి తట్టుకోలేక వి.వినోద్‌కుమార్ అనే అభిమాని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అనేక రకాలుగా వేధిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయనపై వేధింపులకు పాల్పడుతున్నాయి. నా అభిమాన నేతను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుండటం నాకు తీవ్రంగా బాధ కలిగిస్తోంది. ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. అమ్మా నాన్న, అక్కా, చెల్లి, భార్య నన్ను మన్నించాలి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు. వినోద్ (32) హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని రాధాకృష్ణనగర్ వాసి. కాంగ్రెస్‌లో ఉండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉండేవారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి చురుగ్గా పని చేస్తున్నారు. జగన్‌ను కేంద్రంగా చేసుకుని వారం రోజులుగా జరుగుతున్న పలు సంఘటనలతో కలత చెందిన ఆయన, బుధవారం సాయంత్రం తన ఇంటి మేడ పై గదిలో మెడకు తాడు బిగించుకొని ఉరేసుకున్నారు. సాయంత్రం ఏడింటికి కుటుంబ సభ్యులు చూసే సరికే విగత జీవుడై కన్పించారు. ఆయనకు భార్య ఇందిర, కుమారుడు స్టాలిన్ (4), కుమార్తె చుక్కీ (2) ఉన్నారు. స్టాలిన్‌ను ఇడుపులపాయలోని వసతిగృహంలో ఉంచి చదివించాలని సూసైడ్ నోట్‌లో వినోద్ పేర్కొన్నారు. సీబీఐ జగన్‌ను వేధిస్తోందని, ఇదేతీరు కొనసాగితే మరికొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారని నోట్‌లో ఆయన రాసినట్టు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ఎస్‌ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నారు.
Next Post Previous Post